ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు హీరో నవీన్ పోలిశెట్టి. ఆయన సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై కొత్త దర్శకుడు మారి దర్శకత్వంలో ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని నిర్మాతలు విడుదల చేశారు. ఇందులో కథానాయకుడు పెళ్లికి సిద్ధమవుతున్నట్టు టీజర్లో చూపించారు.
ఇందులో నవీన్ పోషించిన పాత్ర పేరు రాజు. ‘రాజుగారి పెళ్లంటే ఎలా ఉండాలి?’ అంటూ భోజనాల దగ్గర చమ్మక్ చంద్ర చేసిన హడావుడి నవ్వులు పూయించింది. అనంత్ అంబానీ వివాహానికి హాజరైన హాలీవుడ్ ప్రముఖుల నంబర్లకోసం, నవీన్ ఏకంగా ముఖేష్ అంబానీకి ఫోన్ చేసి మాట్లాడినట్టు చూపించడం ఈ టీజర్లో కడుపుబ్బ నవ్విస్తుంది.
ఈ టీజర్లో ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ హైలైట్. ఈ షూట్లో వధువుగా మీనాక్షి చౌదరి కనిపించారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య, సమర్పణ: శ్రీకర స్టూడియోస్.