ప్రేమకథల్లో మాంటేజ్ సాంగ్స్ ఇచ్చే కిక్ మామూలుగా ఉండదు. సంగీతం, సాహిత్యం, సందర్భం, చిత్రీకరణ బావుంటే చాలు. ఆ పాట కోసమే మళ్లీ మళ్లీ సినిమా చూస్తుంటారు ప్రేక్షకులు. ఇలాంటి పాటనే ‘దేవర’లో తారక్, జాన్వీకపూర్లపై చిత్రీకరించనున్నారట దర్శకుడు కొరటాల శివ. తాజా సమాచారం ప్రకారం ఈ నెల మూడో వారం జరిగే షెడ్యూల్లోనే ఈ ఎమోషనల్ సాంగ్ చిత్రీకరణ ఉంటుందట. ఈ సినిమాకు అనిరుధ్ స్వరాలందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాట మొత్తం హీరోహీరోయిన్ల ప్రేమను ఆవిష్కరించేలా ఉంటుందని తెలుస్తున్నది.
ఈ పాటలో వీఎఫ్ఎక్స్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా కొరటాల ప్లాన్ చేశారట. దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్తో రెండు భాగాలుగా కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ ఎంతటి విజయాన్ని చూసిందో తెలిసిందే. ఆ సినిమాను మించేలా.. కసితో కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు చిత్రబృందం చెబుతున్నది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది.