Telugu Sitcom | తెలుగు టీవీ చరిత్రలో ఐకానిక్‌గా నిలిచిన కామెడీ సిట్కామ్ ‘అమృతం’ ప్రసారమై ఇటీవలే 24 ఏండ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీరియల్‌ను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు నిర్వహాకులు. యూట్యూబ్ వేదికగా అమృతం అనే ఛానల్ పేరుతో ఈ సిట్కామ్ని రీమాస్టర్డ్ వెర్షన్లో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. నవంబర్ 24 నుంచి ప్రతిరోజు రెండు ఎపిసోడ్లను యూట్యూబ్ వేదికగా వదలనున్నట్లు టీమ్ పంచుకుంది. ఇక ఈ సీరియల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2001 నవంబర్ 18న జెమిని టీవీలో ప్రారంభమైన ఈ సిట్కామ్ 2007 నవంబర్ 18 వరకు విజయవంతంగా ప్రసారమైంది. ఆరు సంవత్సరాలలో దాదాపు 313 ఎపిసోడ్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ప్రముఖ నిర్మాత, రచయిత గుణ్ణం గంగరాజు ఈ హాస్య ధారావాహికను సృష్టించి, నిర్మించగా.. అమృతం పాత్రలో శివాజీ రాజా, నరేష్, హర్షవర్థన్ కాలానికి అనుగుణంగా నటించారు. అంజి పాత్రలో గుండు హనుమంతురావు నటించగా.. సర్వం పాత్రలో వాసు ఇంటూరి, అప్పాజీ పాత్రలో శివన్నారాయణ నరిపెద్ది నటించి మెప్పించారు.