Amrita Rao | బాలీవుడ్ బ్యూటీ అమృతరావు చేసింది తక్కువ సినిమాలే అయినా తన నటనతో ప్రశంసలు అందుకున్నది. 2002లో అబ్ కే బరాస్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ చేసింది. ఆ తర్వాత షాహిద్ కపూర్‌తో ‘ఇష్క్ విష్క్’ చిత్రం మరింత గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత సాహిద్తో ‘వివాహ్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారింది. తెలుగులోనూ మహేశ్‌బాబుతో ‘అదితి’ సినిమాలో నటించింది. కెరీర్ మంచి దశలో సాగుతున్న తరుణంలో ఆర్జే అన్మోల్ను పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది.
ఇటీవల అమృతరావు తన పెళ్లికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. ‘కపుల్ ఆఫ్ థింగ్స్’ వార్షికోత్సవ స్పెషల్ ఎపిసోడ్లో తన వివాహానికి సంబంధించిన విషయాలను వివరించింది. ప్రముఖ ఇస్కాన్ టెంపులో రహస్యంగా పెళ్లి చేసుకున్నామని, పెళ్లి కోసం కేవలం రూ.1.5లక్షల మాత్రమే ఖర్చు చేసినట్లు చెప్పింది. ఇందులోనే పెళ్లికి సంబంధించి దుస్తులు, కల్యాణ వేదిక, ప్రయాణ తదితర ఖర్చులున్నాయని తెలిపింది. కేవలం దగ్గరి బంధువుల సమక్షంలోనే పెళ్లి జరిగిందని చెప్పింది. పెళ్లి సందర్భంగా అన్మోల్, తాను డిజైనర్ దుస్తులు కాకుండా సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలనుకున్నామని, రూ.30వేలు పెట్టిన బట్టలు కొన్నామని, వివాహ వేదిక కోసం రూ.11వేలు చెల్లించినట్లు వివరించింది.
పెళ్లికి దగ్గరి బంధువులు, కొందరు స్నేహితులను మాత్రమే ఆహ్వానించామని, తక్కువ ఖర్చుతోనే వివాహతంతు పూర్తి చేయాలనుకున్నట్లు తెలిపింది. అయితే, ఇలాంటి విషయాలు బడ్జెట్‌ను అర్థం చేసుకునేందుకు ప్రజలకు సహాయపడతాయని అన్మోల్ పేర్కొన్నారు. ఖర్చుతోనూ ఆనందంగా పెళ్లి చేసుకోవచ్చని తెలిపారు. అన్మోల్ – అమృతరావు 2016 పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇద్దరికి కొడుకు ఉన్నాడు. అమృత పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కుటుంబానికి సంబంధించి ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.