దేశానికి గర్వకారణమైన నటీమణుల్లో శోభన ఒకరు. నాట్యానికి జీవితాన్ని అంకితం చేసి, వైవాహిక జీవితాన్ని సైతం త్యాగం చేసిన గొప్ప కళాకారిణి శోభన. ఇటీవలే ఆమె ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రీసెంట్గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ఇంటరాక్ట్ అయిన శోభన.. కొన్నేళ్ల క్రితం షూటింగ్లో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ‘ ‘కల్కి’ సినిమాలో అమితాబ్ సార్‌తో కలిసి నేను నటించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ అంతకు ముందే ఆయనతో నేనొక సినిమా చేశా. అయితే.. అందులో నేను హీరోయిన్ని కాదు. ఓ ప్రత్యేక గీతంలో నర్తించానంతే. అహ్మదాబాద్‌లో ఆ పాట షూటింగ్ జరిగింది. ఆ రోజును జీవితంలో మర్చిపోలేను.ఆ ఒక్క పాటలోనే నేను చాలా కాస్ట్యూమ్స్ మార్చుకోవాల్సివుంది. అమితాబ్ కోసం ప్రత్యేకంగా కారవాన్ తెప్పించారు. నాకు కారవాన్ లేదు. అమితాబ్ షూటింగ్ అవుడ్డోర్‌లో కావడంతో ఆయన్ను చూసేందుకు జనం విరగబడ్డారు.
ఎటు చూసినా జనమే. డ్రెస్ మార్చుకోవాలి ఎలా? చేసేది లేక చిత్రబృందాన్ని అనడిగాను. వారిలో ఓ వ్యక్తి.. ‘ఆమె కేరళ నుంచి వచ్చింది.. అక్కడి వాళ్లు దేనికైనా సర్దుకుపోతారు.. ఆ చెట్టు వెనక్కెళ్లి మార్చుకోమను..’ అనేశాడు. నాకు కళ్లవెంట నీళ్లు తిరిగాయి. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు వాకీ టాకీలో అమితాబ్ విన్నారు. పట్టరాని కోపంతో కారవాన్ నుంచి బయటకొచ్చి, అతన్ని పిచ్చి తిట్లు తిట్టారు. ఆ క్షణం అమితాబ్‌ని చూస్తే నాకు చెప్పలేనంత భయం వేసింది. చివరకు తన కారవాన్ నాకిచ్చి, ఆయన బయటే కూర్చున్నారు. ఆ క్షణాలు నేనెప్పటికీ మరిచిపోలేను. ఇన్నాళ్లకు మళ్లీ ‘కల్కి’ సినిమా పుణ్యమా అని ఆయనతో వర్క్ చేసే అవకాశం దొరికింది. లొకేషన్లో ఎవరైనా తన వద్దకు వస్తే, లేచి నిల్చొని విష్ చేస్తారాయన. స్టార్‌గా ఇండియాలో అమితాబ్ స్థాయి ఎవరికీ లేదు. కానీ ఆయన ఒదిగి ఉంటారు. సంప్రదాయాలకు, సంస్కృతికి విలువిస్తారు.’ అంటూ చెప్పుకొచ్చారు శోభన.