Chiranjeevi | సినీరంగంలో తాను రచ్చ గెలిచి ఇంట గెలిచానని వ్యాఖ్యానించారు అగ్ర నటుడు చిరంజీవి. ఏఎన్నార్ నేషనల్ అవార్డును అందుకోవడంతో తాను ఇంట గెలిచానని గర్వంగా ఉందన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా తనకు జరిగిన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకొని చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. సోమవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన వేడుకలో ‘అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు’ను ఆయన అందుకున్నారు. 2024 సంవత్సరానికిగానూ ఈ అవార్డును ప్రదానం చేశారు. అమితాబ్‌బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవి పురస్కారాన్ని స్వీకరించారు.
చిరంజీవి, నాగార్జున, నాగ్అశ్విన్ వంటి వారు నన్ను తెలుగు సినిమాల్లో భాగం చేశారు. తెలుగు ఇండస్ట్రీలో నేను కూడా ఓ సభ్యుడినేనని గర్వంగా చెప్పుకుంటా. తెలుగు చిత్రసీమలో నన్నూ ఓ భాగంగా పరిగణించండి. ఇండియన్ సినిమాకు నాగేశ్వరరావుగారు చేసిన సేవలు అనితరసాధ్యం. ఇక చిరంజీవి నేను ఎప్పుడు ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. చిరంజీవి ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు.
అమితాబ్‌బచ్చన్ నాకు గురువు, స్ఫూర్తిప్రదాత. నాకు ఏ అవార్డు వచ్చినా తొలుత ఆయన నుంచే శుభాకాంక్షలు అందుతాయి. పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు జరిగిన సన్మాన కార్యక్రమంలో అమితాబ్‌గారు ‘చిరంజీవి కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అని చెప్పడం నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆయన మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి. అమితాబ్‌బచ్చన్‌గారితో గడిపిన ప్రతి క్షణం విలువైనది. ఇండియన్ సినిమాకు బాద్షా, షెహన్షా అయిన అమితాబ్ నుంచి ఈ అవార్డు స్వీకరించడం గర్వంగా ఉంది. తెలుగులో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే ఓ నానుడి ఉంది. నా విషయంలో రచ్చ గెలిచి ఇంట గెలిచానని అనిపిస్తోంది. నేను ఇంట గెలిచే ఆవకాశం తెలుగు సినిమా వజ్రోత్సవాల సమయంలో వచ్చింది. నాకు అప్పుడు లెజెండరీ పురస్కారం ప్రదానం చేశారు. అప్పుడు ఎంతో ఆనందపడి ధన్యుణ్ణి అనుకున్నా. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల, కొందరు వ్యక్తులు హర్షించని కారణంగా ఆ పురస్కారాన్ని తీసుకోవడం సముచితం అనిపించలేదు. అందుకే ఆ రోజు అవార్డుని ఓ క్యాప్సుల్ బాక్స్‌లో పడేసి నాకు అర్హత ఎప్పుడు వస్తుందో అప్పుడే తీసుకుంటానని చెప్పాను. ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ది గ్రేట్ ఏఎన్నార్ అవార్డును ది గ్రేట్ అమితాబ్బచ్చన్గారి చేతుల మీదుగా అందుకున్నా. ఇప్పుడు నేను ఇంట గెలిచాను.. రచ్చగెలిచాను అనిపిస్తోంది. ఈ పురస్కార ప్రదానం గురించి చెప్పడానికి నాగార్జున, వెంకట్ ఇంటికి వచ్చినప్పుడు చాలా ఆనందించాను. నాకు పద్మభూషణ్, పద్మవిభూషణ్, గిన్నిస్‌బుక్‌లో స్థానం వచ్చినా ఈ అవార్డు విషయంలో నా భావోద్వేగం వేరుగా ఉంది. నావాళ్లు నన్ను గుర్తించి అవార్డు ఇస్తుండటం నాకు గొప్ప విషయంగా అనిపించింది. ఇది నాకు అన్ని పురస్కారాలకు మించిన ప్రత్యేకమైన అవార్డు అని నాగార్జునతో చెప్పాను. ఈ వేడుకలో మా అమ్మని ముందు సీటులో కూర్చొబెట్టడానికి ప్రధాన కారణం..అమ్మ నాగేశ్వరరావుగారికి వీరాభిమాని. అక్కినేని నాగేశ్వరరావుగారితో కలిసి ‘మెకానిక్ అల్లుడు’ చిత్రంలో నటించినప్పుడు ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నా. సెట్లో ఆయన్ని చూస్తే నడిచే ఎన్సైక్లోపీడియా అనిపించేది. ఆయన నాకు పితృసమానులు. ఈ విషయం ఎక్కడా చెప్పే అవకాశం రాలేదు. అందుకే ఇక్కడ చెబుతున్నా. దేవానంద్, లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, కె.బాలచందర్ వంటి లెజెండ్స్‌కు దక్కిన ఈ పురస్కారం నాకు దక్కడ పూర్వ జన్మ సుకృతం. ఈ అవార్డు నా జీవితానికి పరిపూర్ణతనిచ్చింది. ఈ రోజుని జీవితాంతం గుర్తుంచుకుంటాను. నాగార్జున నాకు భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన స్నేహితుడు. నాకు ఆహారం, ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ సలహాలిస్తుంటాడు. ఆయన ఏం చెప్పినా ఫాలో అయిపోతుంటాను. అక్కినేని కుటుంబం మొత్తం మా కుటుంబ సభ్యుల్లాంటివారే. వారు చూపించే ప్రేమను నేను జీవితాంతం పదిలపరచుకుంటాను.
‘భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచే గొప్ప వ్యక్తులను గౌరవించుకోవడమే ఏఎన్నార్ అవార్డు ముఖ్య ఉద్దేశం. ఈ రోజు ఈ వేదికపై అలాంటి గొప్ప వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. వారే ఇండియన్ సినిమా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి. ఈ ఏడాది ఏఎన్నార్ పురస్కారాన్ని నా మిత్రుడు పద్మవిభూషణ్ చిరంజీవికి అందిస్తున్నందుకు మా కుటుంబసభ్యులంతా గర్విస్తున్నాం.. ఆనందిస్తున్నాం. దాన్ని మనందరం ఎంతగానో ఆరాధించే పద్మవిభూషణ్ అమితాబ్బచ్చన్గారు ప్రజెంట్ చేయడం ఈ వేడుకకు ఇంకా ప్రత్యేకం. రీసెంట్గా ‘కల్కి’ చూశాను. అమితాబ్జీ అశ్వత్థామగా చూసినప్పుడు మా ఒరిజినల్ మాస్ హీరో ఈజ్ బ్యాక్ అనిపించింది. ఇదే విషయం ఆయనకు కాల్ చేసి చెప్పాను. మాలాంటివారందరికీ ఆయనే ఇన్స్పిరేషన్. ఇక మిత్రుడు చిరంజీవితో నాకెన్నో బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి. రికార్డులు బ్రేక్ చేయడం ఆయనకు అలవాటు. ఇటీవలే గిన్నిస్‌బుక్‌లోకి కూడా ఎక్కేశారు. నేను సినిమాల్లోకి వద్దామనుకుంటున్న రోజుల్లో చిరంజీవి షూటింగ్ మా స్టూడియో జరుగుతుంటే ‘ఒకసారి వెళ్లి చూసి నేర్చుకో..’ అని నాన్నగారు చెప్పారు. వెళ్లి చూశాను. ఏదో వాన పాట షూటింగ్ జరుగుతుంది. చిరంజీవి, రాధ డ్యాన్స్ చేస్తున్నారు. ఆ డ్యాన్స్, ఆయన గ్రేస్ చూశాక నాకు భయమేసింది. సినిమాలు మనకు కరెక్ట్ కాదని, మరో దారి చూసుకుందాం అనుకున్నా. నటుడిగానే కాదు, ఎన్నో సేవాకార్యక్రమాలతో సంఘ సేవకునిగా కూడా పదుగురికి ఆదర్శంగా నిలిచారు చిరంజీవి. ఆయన్ను అమితాబ్ ‘కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా’గా అభివర్ణించారు. అది ముమ్మాటికి నిజం. అలాంటి గొప్ప వ్యక్తికి నాన్నగారి అవార్డు అందించడం ఆనందంగా ఉంది’ అన్నారు నాగార్జున. ఇంకా ఈ కార్యక్రమంలో చిరంజీవి తల్లిగారైన అంజనాదేవి, టి.సుబ్బిరామిరెడ్డి, వెంకటేశ్, ఎం.ఎం.కీరవాణి, రామ్‌చరణ్, బ్రహ్మానందం తదితరులతోపాటు అక్కినేని కుటుంబసభ్యులందరూ పాల్గొన్నారు.