Amitabh Bachchan | బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ పుట్టిన రోజు (అక్టోబర్ 11) నేడు. 82 సంవత్సరాల వయసులోనూ ఆయన వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల కల్కి 2898 ఏడీ మూవీలో ‘అశ్వత్థామ’ పాత్రలో అద్భుతంగా నటించి.. యావత్ సినీ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. తాజాగా రజనీకాంత్ వెట్టయాన్ మూవీలో న్యాయవాది పాత్రలో మెరిశారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన దశాబ్దాల పాటు బాలీవుడ్‌ను ఏలుతున్నారు. ఓ వైపు సినిమాలు, మరో వైపు టీవీషోలతో పాటు యాడ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
అమితాబ్ 1942, అక్టోబర్ 11న అలహాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి ప్రముఖ హిందీ కవి హరివంశ్ రాయ్ బచ్చన్. మొదట బిగ్‌బీకి ఇంక్విలాబ్ అని పేరు పెట్టగా.. ఆ తర్వాత అమితాబ్‌గా మార్చారు. హరివంశ్ కలం పేరు ‘బచ్చన్’. అమితాబ్‌కు ‘బచ్చన్’ ఇంటిపేరుగా మారింది. ఢిల్లీలో బీఎస్సీ వరకు చదివిన అమితాబ్‌కు నటన అంటే ఎంతో మక్కువ. తల్లి మద్దతుతో ఆయన ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. తొలిసారిగా 1969లో ‘భువన్ షోమ్’ మూవీకి గాత్రదానం చేశారు. అనంతరం ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ దర్శకత్వంలో ‘సాత్ హిందుస్తానీ’లో నటించారు. ఈ మూవీలో ఏడు ప్రధానపాత్రలు ఉండగా.. ఇందులో ఓ పాత్రలో అమితాబ్ కనిపించారు. ఈ మూవీ ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పర్వానా, గుడ్డీ, బాంబే టూ గోవా, జంజీర్, లావరీస్, కాలాపతర్, షోలే తదిత, చిత్రాల్లో నటించి అగ్రనటుడిగా ఎదిగారు.
ఇక అమితాబ్ పుణు టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో జయ బాధురిని కలిశారు. ఆ తర్వాత ఇద్దరూ జంజీర్ సినిమాలో నటించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అదే ఏడాది పెళ్లి చేసుకున్నారు. వారికి కొడుకు అభిషేక్ బచ్చన్, కూతురు శ్వేతానంద ఉన్నారు. అమితాబ్ 2000 నుంచి రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి’ హోస్ట్ చేస్తున్నారు. ఇక అమితాబ్ బచ్చన్ నాలుగు జాతీయ అవార్డులు, 15 ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. ఆయన 1994లో వ్యాపారరంగంలోకి అడుగుపెట్టి నష్టపోయారు. అబితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఈవెంట్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీని నెలకొల్పారు. అది ఆయనకు నష్టాలను తెచ్చిపెట్టింది. మొత్తం నాలుగు జాతీయ అవార్డులు, 15 ఫిలింఫేర్ అవార్డులు పొందారు. సినీరంగానికి ఆయన చేసిన సేవలకు కేంద్రం 1984లో పద్మశ్రీతో సత్కరించింది. ఆ తర్వాత పద్మభూషణ్ (2001), పద్మవిభూషణ్ (2015), దాదా ఫాల్కే అవార్డ్ (2018) ప్రకటించింది.
బిగ్‌బీ నికర విలువ రూ.3,190 కోట్లు. ఆయన వద్ద రోల్స్ రాయిస్ ఫాంటమ్, పోర్షే కేమాన్ ఎస్, మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్560 తదితర కార్లు సైతం ఉన్నారు. బిగ్‌బీ ఎక్కువగా బ్రాండ్ ఎండార్స్మెంట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అమితాబ్ బచ్చన్‌కి ఇండ్లు కూడా చాలానే ఉన్నాయి. ప్రతీక్ష, జానక్, వత్స, జల్సా పేరుతో ఉన్నాయి. వత్సని సిటీ బ్యాంక్ ఇండియాకు లీజుకు ఇచ్చారు. దాంతోపాటు ముంబయిలోని సీ ఫేసింగ్ అపార్ట్మెంట్లో 31వ అంతస్తులో ఫ్లాట్‌ని కొనుగోలు చేశారు. బిగ్‌బీ సినిమాల్లో ఒక్కో చిత్రానికి దాదాపు రూ.6కోట్ల వరకు తీసుకుంటారు. బ్రహ్మాస్త్ర మూవీకి రూ.8కోట్ల నుంచి రూ.10కోట్ల వరకు తీసుకున్నారని టాక్.