Ameesha Patel | ఒకప్పటి అందాలతార అమీషా పటేల్‌కి కోపం వచ్చింది. ‘గదర్2’ దర్శకుడు అనిల్శర్మపై అంతెత్తు లేచింది. వివరాల్లోకెళ్తే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిల్‌శర్మ మాట్లాడుతూ ‘గదర్ 2’లో అత్తగా నటించేందుకు అమీషా అంగీకరించలేదని, నర్గీస్ దత్ లాంటి మహానటీమణులు చిన్న వయసులోనే వృద్ధ పాత్రలు పోషించారని ఎంత నచ్చజెప్పినా.. ఆమె మాత్రం చేయను గాక చేయనన్నదని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై అమీషా వివరణ ఇస్తూ.. ‘డియర్ అనిల్.. అది జీవితం కాదు. కేవలం సినిమా.
కాబట్టి తెరపై నేను ఏం చేయాలి? ఏం చేయకూడదు అనేది పూర్తిగా నా వ్యక్తిగతం. ‘గదర్’ కోసమే కాదు, ఏ సినిమా కోసమైనా సరే.. అత్తయ్య పాత్రలు నేను చేయను. వందకోట్లు ఇచ్చినా అలాంటి పాత్రలకు అంగీకరించను. మీరంటే నాకెంతో గౌరవం. దాన్ని తగ్గించుకోవద్దు.’ అంటూ ఘాటుగా స్పందించింది అమీషా.