Online Cinima Ticketing | ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధరలు పెరగనున్నాయని తెలుస్తోంది. అయితే ఆన్లైన్ విధానాన్ని అధికారికంగా ప్రవేశపెట్టడానికి ముందు టికెట్ల ధరలు పెరుగుతాయని సమాచారం. ప్రస్తుతం ఆన్లైన్ టికెట్ విధానంపై ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్.. సినిమా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య కొంత కాలంగా చర్చలు సాగుతున్నాయి. ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని తాజాగా గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ఎగ్జిబిటర్లతో భేటీ అయ్యారు. ఈ చర్చల్లో ఎగ్జిబిటర్లు తమ ఇబ్బందులను రాష్ట్ర మంత్రి దృష్టికి తెచ్చారని సమాచారం. ఇంతకు ముందు పలువురు ప్రముఖ సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో పేర్ని నాని చర్చలు జరిపారు.
థియేటర్ల వ్యవస్థను పరిశ్రమగా గుర్తించినందున పరిశ్రమలకు వర్తించే రాయితీలను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆ తరువాత రోజే నిర్మాతలు, ఎగ్జిబిటర్ల ఖాతాల్లో జమ అవుతుందని మంత్రి తెలిపారు. ఎగ్జిబిటర్లంతా సర్కార్ ప్రతిపాదిత ఆన్లైన్ టికెటింగ్ విధానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని నిర్మాత, ఎగ్జిబిటర్ అంబికా కృష్ణ తెలిపారు. త్వరలోనే ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయన్నారు.