Amazon Prime | ప్రస్తుతం ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. కరోనా పుణ్యమా అని ఓటీటీలకు ఎక్కడలేని ఆదరణ పెరిగింది. ఒకప్పుడు థియేటర్ల నుంచి వెళ్లిపోయిన సినిమా టీవీల్లో చూడాలంటే కనీసం మూడు నుంచి నాలుగు నెలలు సమయం పట్టేది. కానీ ఓటీటీలు వచ్చాక వారం, రెండు వారాల్లోనే అరచేతిలోకి వచ్చేస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. ప్రతీ వారం కొత్త సినిమా ఏది రిలీజవుతుందా అని తెగ వెతికేస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీల్లో ఈ మధ్య వెబ్ సిరీస్‌ల ట్రెండ్ ఎక్కువైపోయింది. కంటెంట్ కాస్త ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటే ఐదారు గంటలైనా అలవోకగా చూసేస్తున్నారు. ఇవే కాకుండా టాక్ షోలు, క్రికెట్, బాక్సింగ్ ఇలా ఎంటర్టైనమెంట్ విభాగంలో ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి.
ఇక ఇండియాలో టాప్ ఓటీటీ సంస్థల్లో ఒకటిగా రాణిస్తుంది అమెజాన్ ప్రైమ్. ఎప్పుడూ కొత్త కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఊరిస్తుంది. పైగా ఒక్క సబ్స్క్రిప్షన్ పైన నాలుగు డివైజ్‌లు ఒకే సారి చూసే వెసలు బాటు కల్పించింది. అదీ కాకుండా ఈ కామర్స్ ద్వారా అనేక సౌకర్యాలు పొందగలిగే ఆప్షన్‌ను కూడా ఇచ్చింది. కాగా ఇన్నాళ్లు యాడ్‌ను స్కిప్ చేసే వెసులు బాటు కల్పించిన ప్రైమ్ సంస్థ.. ఇకపై డబ్బులు చెల్లిస్తేనే స్కిప్ చేసే ఆప్షన్‌ను ఇవ్వనుందట. అంతేకాకుండా ఇంత వరకు కేవలం సినిమా/వెబ్ సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు మాత్రమే యాడ్ వచ్చేది. ఆ తర్వాత వీడియో మధ్యలో కానీ చివర్లో కానీ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు పరిమిత సంఖ్యలో ప్రకటనలను ప్రసారం చేయాలని ప్రైమ్ సంస్థ భావిస్తుందట.
వచ్చే ఏడాది నుంచి దీన్ని అమలు పరిచేలా ప్రైమ్ నిర్వాహకులు కసరత్తులు చేస్తున్నారట. ఇకపై యాడ్ ఫ్రీ కంటెంట్ చూడాలంటే ప్రైమ్ సబ్స్క్రైబర్లు అదనంగా మరికొంత రుసుము చెల్లించాల్సిందే. కాగా ఇప్పటికే హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్‌లలో ఈ స్ట్రాటజీ అమలులో ఉంది. ప్రస్తుతం హాట్‌స్టార్ సబ్ స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ.899 ఉండగా.. యాడ్ ఫ్రీ కంటెంట్ కావాలంటే మాత్రం అదనంగా మరో రూ.200 కలిపి మొత్తంగా రూ.1099 చెల్లించాలి. లేకపోతే సినిమాలు, సిరీస్‌ల మధ్యలో యాడ్స్ వస్తునే ఉంటాయి.