అమర్దీప్, అశ్విని రెడ్డి జంటగా నటిస్తున్న సినిమా ‘అభిలాష’. ఈ సినిమాను శ్రీ హరిహర ధీర మూవీ మేకర్స్ పతాకంపై సీహెచ్. శిరీష నిర్మించారు. శివప్రసాద్ చలువాది దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు శివప్రసాద్ మాట్లాడుతూ… ‘జీవితంలో విద్యకు ఉన్న ప్రాధాన్యతను చెప్పే చిత్రమిది. మనతో పాటు సమాజ చైతన్యానికి, అభివృద్ధికి విద్య ఎంతగా ఉపయోగపడుతుందో ఈ కథలో చూపిస్తున్నాం.
ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా నవరసాల భావోద్వేగాలతో ఈ సినిమాను రూపొందించాం’ అన్నారు. నిర్మాత సీహెచ్. శిరీష మాట్లాడుతూ…‘చదువు వద్దని చెప్పే ప్రతినాయకుడితో హీరో ఎలాంటి పోరాటం చేశాడు అనేది చిత్ర కథ. ప్రతి పాత్రకు తగిన నటీనటులు దొరికారు. త్వరలోనే మా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. బాహుబలి ప్రభాకర్, సమ్మెట గాంధీ, అశోక్ కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సౌమ్య శర్మ, సంగీతం : ఎం.ఎం.కుమార్.