‘మేజర్ ముకుంద్ వరదరాజన్, ఇందు రెబెకాల ట్రూ స్టోరీ ఇది. దేశాన్నీ, బంధాన్నీ ప్రేమించే కుటుంబం ఎలా ఉంటుందో దర్శకుడు రాజ్‌కుమార్ అద్భుతంగా చూపించారు. ఇందులో మేజర్ ముకుంద్‌గా నేను, ఇందుగా సాయిపల్లవి కనిపిస్తాం. యాక్షన్‌తోపాటు ప్రేమ కూడా ఇందులో బలంగా ఉంటుంది. కమల్‌హాసన్‌గారు ఈ సినిమా నిర్మాత కావడంతో ఆటోమేటిగ్గా సినిమాకు హైప్ పెరిగింది. అందరికీ నచ్చుతుందని నమ్మకంతో ఉన్నాం’ అని శివకార్తికేయన్ అన్నారు. ఆయనా, సాయిపల్లవి జంటగా నటించిన బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకుడు. సోనీపిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటైర్టెన్మెంట్తో కలిసి కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ నెల 31న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో శివకార్తికేయన్ మాట్లాడారు. అతిథిగా విచ్చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. సాయిపల్లవి మాట్లాడుతూ ‘ ‘అమరన్’ సినిమాతో మీ ముందుకొస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇది రియల్ సోల్జర్ జర్నీ. నా పాత్రను దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న సుధాకర్‌రెడ్డి, నిఖిత రెడ్డి గార్లకు థ్యాంక్స్.’ అని చెప్పారు. ఇంకా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి, గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి కూడా మాట్లాడారు.