సాధారణంగా అగ్ర హీరోల సినిమాలకు ఒక వారం లేదా రెండు వారాల ముందుగానో అడ్వాన్స్బుకింగ్స్ మొదలుపెట్టడం చూస్తుంటాం. కానీ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఈ ట్రెండ్‌ను తిరగరాశాడు. ఆయన దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ఒడిస్సీ’ వచ్చే ఏడాది జూలై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఐమ్యాక్స్ 70ఎం.ఎం. స్క్రీన్స్‌కు సంబంధించిన టికెట్లను గురువారం నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. అడ్వాన్స్బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే అమెరికా వ్యాప్తంగా ఐమాక్స్ స్క్రీన్లకు సంబంధించిన టికెట్లు మొత్తం అమ్ముడుపోయాయట.
ఇదొక అరుదైన రికార్డని, ఏడాది ముందే బుకింగ్స్ ఓపెన్ చేయడం, అప్పుడే టికెట్లు అమ్ముడైపోవడం..ఇదంతా మాస్టర్ స్టోరీటెల్లర్ క్రిష్టోఫర్ నోలన్ క్రేజ్‌కు నిదర్శనమని అమెరికా ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గ్రీకు పురాతన ఇతిహాసం ‘ఒడిస్సీ’ ఆధారంగా నోలన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మెమెంటో, ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్, డన్కిర్క్, టెనెట్, ఓప్పెన్ హైమర్ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు దర్శకుడు క్రిష్టోఫర్ నోలన్.