Allu Sirish-Nayanika | టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఆయన తన ప్రేయసి నయనికని రీసెంట్గా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని అల్లు అరవింద్ నివాసంలో ఘనంగా జరిగిన ఈ వేడుకలో కాబోయే దంపతులు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు అల్లు, మెగా ఫ్యామిలీలు, అలాగే నయనిక కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై శిరీష్–నయనిక జంటను మనసారా ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శిరీష్–నయనిక జంట చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలు అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
నిశ్చితార్థం అనంతరం అల్లు శిరీష్ సోషల్ మీడియాలో ఒక హృదయానికి హత్తుకునే పోస్ట్ పెట్టారు. 2023 అక్టోబర్‌లో వరుణ్ తేజ్–లావణ్య త్రిపాఠి పెళ్లి సందర్భంగా నితిన్, శాలిని కందుకూరి ఒక పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి శాలిని తన స్నేహితురాలు నయనికను కూడా ఆహ్వానించింది. అప్పుడే మేమిద్దరం మొదటిసారి కలుసుకున్నాం. సరిగ్గా రెండేళ్ల తర్వాత మేము ప్రేమలో ఉన్నాం, ఇప్పుడు నిశ్చితార్థం కూడా చేసుకున్నాం. భవిష్యత్తులో నా పిల్లలు మా కథ ఎలా ప్రారంభమైందని అడిగితే ‘ఇలానే మీ అమ్మను కలిశా’ అని చెబుతాను” అంటూ శిరీష్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. అభిమానులు, సెలబ్రిటీలు, నెటిజన్లు శిరీష్–నయనిక జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఎంగేజ్మెంట్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్–ఉపాసన, వరుణ్ తేజ్–లావణ్య త్రిపాఠి, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తదితరులు పాల్గొని సందడి చేశారు. ఫ్యామిలీ ఫోటోలు, స్నేహపూర్వక క్షణాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.నయనికకు శాలిని కందుకూరి, రానా భార్య మిహికా బజాజ్‌లతో మంచి స్నేహం ఉందని సమాచారం. ఈ పరిచయం ద్వారానే శిరీష్, నయనిక దగ్గరయ్యారని చెబుతున్నారు.ఇక వివాహ తేదీ విషయమై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. అయితే, పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఏడాదిలో ఈ శుభకార్యం జరగవచ్చని తెలుస్తోంది.