సినిమా : బడ్డీ
తారాగణం: అల్లు శిరీష్, గాయత్రీ భరద్వాజ్, అజ్మల్, ప్రిషా రాజేశ్ సింగ్..
దర్శకత్వం: శామ్ ఆంటోన్
నిర్మాత: కేఈ జ్ఞానవేల్‌రాజా
సమర్పణ: స్టూడియోగ్రీన్
ఈ వారం చిన్న సినిమాలు థియేటర్లపై దండయాత్ర చేశాయి. వాటిలో బడ్జట్ పరంగానూ, కాస్టింగ్ పరంగానూ కాస్తంత పెద్ద సినిమా అంటే ‘బడ్డీ’నే అని చెప్పాలి. అల్లువారి అబ్బాయి శిరీష్ ఇందులో కథానాయకుడు కావడం, ప్రతిష్టాత్మక స్టూడియోగ్రీన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను బడ్డీ అందుకున్నదా? లేదా? తెలుసుకోవాంటే ముందు కథలోకెళ్లాలి.
కథ గురించి
వృత్తిరిత్యా పైలెట్ అయిన ఆదిత్య(అల్లు శిరీష్).. విధి నిర్వహణలో భాగంగా తరచూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌తో మాట్లాడుతూ ఉంటాడు. ఈ క్రమంలో అక్కడ పనిచేసే పల్లవితో మాట కలుస్తుంది. ఒకరినొకరు చూసుకోకుండానే మనసులు కూడా కలుస్తాయి. ఆదిత్యకు తన మనసులో మాట చెప్పే రోజు కోసం పల్లవి ఎదురుచూస్తూవుంది. సరైన సందర్భం చూసి, ఆదిత్యకు ఐలవ్యూ చెప్పేయాలనుకుంది. కానీ.. తను చేసిన చిన్న పొరపాటు వల్ల ఆదిత్య ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు. దాంతో నేరుగా వెళ్లి ఆదిత్యకు క్షమాపణ చెబుదామనుకుంది. ఇంతలోనే తను కిడ్నాప్ అయ్యింది. ఈ క్రమంలో జరిగిన గొడవలో తను కోమాలోకి వెళ్లగా.. ఆమె ఆత్మ ఓ టెడ్డీబేర్లోకి వెళ్లింది. ప్రాణంతో ఉండగానే ఆత్మ బయటకు రావడం ఏంటి? అసలు పల్లవిని కిడ్నాప్ చేసిందెవరు? ఈ కిడ్నాప్కీ హాంకాంగ్‌లో ఉన్న అర్జున్కుమార్వర్మ(అజ్మల్)కూ ఉన్న సంబంధం ఏంటి? పల్లవిని ఆదిత్య ఎలా కాపాడాడు? అ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
కథా విశ్లేషణ
ఈ లైన్ పాతదే. రామ్, తమన్నాలతో దర్శకుడు కరుణాకరన్ తీసిన ‘ఎందుకంటే ప్రేమంట’ పాయింట్ దాదాపు ఇదే. హీరోయిన్ కొన్ని కారణాలవల్ల కోమాలోకి వెళ్లిపోవడం.. తన ఆత్మ శరీరాన్ని విడిచేసి హీరోని కలవడం.. ఆ సమస్యల్ని హీరో పరిష్కరించి మళ్లీ హీరోయిన్ని బతికించడం ఇదే మెయిన్ థ్రెడ్. దీనికి అవయవాల అక్రమ రవాణా అనే నేపథ్యాన్నీ, ఓ టెడ్డీబేర్‌ని జోడించాడు దర్శకుడు. హీరోయిన్ ఆత్మ టెడ్డీబేర్లోకి వెళ్లడం ఇక్కడ కొత్తదనం. హీరోయిన్ ఆత్మతో కూడిన ఈ టెడ్డీబేర్.. హీరోతో కలిసి అవయవాలను అక్రమ రవాణా చేస్తున్న ముఠా ఆట ఎలాకట్టించింది? అనేది ఈ కథలో ఆసక్తికరమైన అంశం. కథను మొదలుపెట్టిన తీరు బావుంది. హీరోయిన్ ఆ ముఠా ట్రాప్ పడిపోవడం, కోమాలోకి వెళ్లిపోవడం.. వెంటనే ఆమె ఆత్మ టెడ్డీబేర్లోకి చేరిపోవడం.. అంతా చకచకా జరిగిపోయాయి. ఈ ఇరవై నిమిషాలూ సినిమా బావుంది. ఆ తర్వాత అంతా తాబేలు నడకే.. ఈ టెడ్డీబేర్లోకి ఆత్మ అనేది కూడా అంతకు ముందు చూసిందే. దాంతో ప్రేక్షకులకు పెద్ద థ్రిల్లింగేమీ అనిపించదు. పైగా కన్వీనియంట్‌గా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడేమో అనిపిస్తుంది. అయితే.. యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. ద్వితీయార్ధంలో టెడ్డీనీ.. దాని బాడీని వెతికి పట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉంటాయి.
నటీనటుల నటన
అల్లు శిరీష్ అద్భుతంగా నటించాడని చెప్పడానికి ఏమీలేదు. అసలు ఈ కథలో చెయ్యడానికి కూడా ఏమీ లేదు. ఉన్నది చేసుకుంటూ వెళ్లిపోయాడు అంతే.. కాబట్టి అది అతని తప్పుకాదు. ఇక కథానాయిక గాయత్రి భరద్వాజ్.. మంచి అందగత్తె. కానీ సినిమా అంతా కోమాలోనే ఉంది. నటనంతా టెడ్డీబేర్దే. సో.. ఆమెకీ చేయడానికి ఏమీలేదు. అజ్మల్ విలనీ ఆరంభంలో అదరిపోయింది. పోనుపోనూ తేలిపోయింది. మిగతా వారంతా పరిధిమేర రక్తికట్టించారు.
టెక్నికల్‌గా
నిర్మాణ పరంగా క్వాలిటీ మేకింగ్ కనిపించింది. దర్శకుడు సామ్ ఆంటోన్ పాత కథను కొత్తగా చూపించేందుకు ప్రయత్నించి తడబడ్డాడు. పాటలేం వినసొంపుగా లేవు. కెమెరా వర్క్ బావుంది. కథలోని ప్రధాన పాత్ర అయిన టెడ్డీకీ, హీరోకి మధ్య బాండింగ్ సరిగ్గా చూపిస్తే ఫలితం వేరేలా ఉండేదేమో.. మొత్తంగా చెప్పొచ్చేదేంటంటే.. పాత కథను కొత్తగా చూపించడంలో దర్శకుడు కాస్త ఇబ్బంది పడ్డాడు..
ప్లస్ పాయింట్స్:
యాక్షన్ సన్నివేశాలు..
సినిమాటోగ్రఫీ..
మైనస్ పాయింట్స్
రొడ్డకొట్టుడు కథ..
నత్తనడకన నడిచే కథనం..
రేటింగ్ : 2.25/5