Allu kanakaratnam | ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు కనకరత్నమ్మ కన్నుమూసారు. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఆమె శుక్రవారం అర్థరాత్రి 1:45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆమె పార్థీవదేహం అల్లు అరవింద్ నివాసానికి తరలించనున్నారు. మధ్యాహ్నం కోకాపేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కనకరత్నమ్మ మృతి వార్త తెలియగానే, రాంచరణ్ మైసూర్ నుంచి, అల్లు అర్జున్ (బన్నీ) ముంబై నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. ప్రస్తుతం అల్లు అరవింద్‌తో కలిసి మెగాస్టార్ చిరంజీవి అంత్యక్రియల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
ఇతర కుటుంబ సభ్యులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు తదితరులు విశాఖపట్నంలో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటుండటంతో, వారు ఆదివారం అల్లు కుటుంబాన్ని కలిసి సంతాపం తెలపనున్నారు. అల్లు కనకరత్నమ్మ మృతి వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం తెలియజేస్తున్నారు. అల్లు కుటుంబానికి ఇది తీరని లోటు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న కనకరత్నం మార్చి నెలలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబసభ్యులు ఆమెని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి, వెంటిలేటర్‌పై చికిత్స అందించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.
అయితే ఆమె కాస్త కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. అల్లు రామలింగయ్య, కనకరత్నం దంపతులకు ముగ్గురు సంతానం కాగా వారిలో కుమారుడు అల్లు అరవింద్, కుమార్తె సురేఖ సినీ అభిమానులకు సుపరిచితమే రామలింగయ్య 2004లో మరణించిన తర్వాత కనకరత్నం బయట పెద్దగా కనిపించలేదు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో ఆమె కనిపించింది. ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి, ఆ తర్వాత జైలు నుంచి బెయిల్‌పై విడుదలై ఇంటికి వచ్చినప్పుడు నాన్నమ్మే తనకు దిష్టి తీసింది. ఆ వెంటనే అల్లు అర్జున్ నాన్నమ్మ కాళ్లకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ అయింది.