హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ సికింద్రాబాద్ బేగంపేట్ మినిష్టర్ రోడ్డులో ఉన్న కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం పుష్ప 2 సినిమా హీరో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. అలాగే ఈ ఘటనలో మృతిచెందిన రేవతి భర్తను కూడా అల్లు అర్జున్ పరామర్శించారు. అల్లు అర్జున్‌తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. అల్లు అర్జున్ ఆసుపత్రికి వచ్చిన నేపథ్యంలో ఉత్తర మండలం పోలీసులు డీసీపీ సాధన రష్మీ ఆధ్వర్యంలో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. అటు పేషంట్లకు, ఇటు అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మళ్లీ ఆసుపత్రికి రావాలంటే తమకు ఖచ్చితంగా సమాచారం అందించాలని అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.