
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి లో చిత్రీకరణ జరుపుకుంటుంది. మరో పది రోజుల పాటు కాకినాడ, మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తారని తెలిసింది. దాంతో ఓ పాట మినహా తొలి భాగం చిత్రీకరణ పూర్తవుతుందట. హైదరాబాద్ తిరిగొచ్చిన తర్వాత ప్రత్యేక గీతం తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ నెలాఖరుకు మూవీ షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తుండగా, క్రిస్మస్ కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అయితే శనివారం రాజమండ్రి సహా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో సినిమా షూటింగ్ చేయడానికి అవకాశం లేకపోయింది. దీంతో సుకుమార్ షూటింగ్‌ను క్యాన్సిల్ చేసేశాడు. షూటింగ్ లేకపోవడంతో బన్నీ అక్కడి ప్రాంతాలను చుట్టేస్తున్నారు.
ఈ క్రమంలోనే కాకినాడలోని థియేటర్లో ‘సీటీమార్’ చిత్రాన్ని అల్లు అర్జున్ వీక్షించారు.అలానే గోకవరంలో రోడ్డు పక్కన హోటల్లో బన్నీ టిఫిన్ చేయగా, అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. బన్నీ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.