తెలుగు సినిమా పౌరాణికంతో మొదలైంది. పౌరాణికంతోనే ఎదిగింది. కానీ.. పోనుపోనూ పౌరాణికాలు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. టాలీవుడ్లో వచ్చిన చివరి పౌరాణికం ‘శ్రీరామరాజ్యం’. ఆ తర్వాత మళ్లీ పౌరాణిక చిత్రం రాలేదు. అయితే.. త్వరలో ఓ పానిండియా పౌరాణిక చిత్రానికి రంగం సిద్ధం అవుతున్నది. ఈ విషయాన్ని స్వయంగా ఆ చిత్ర నిర్మాతే ప్రకటించారు. ఆ నిర్మాత ఎవరో కాదు.. సితార ఎంటైర్టెన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ. ఇక సినిమా వివరాల విషయానికొస్తే.. అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆ సినిమా పౌరాణిక చిత్రమని, అందులో కుమారస్వామిగా బన్నీ నటించనున్నారని, శివపురాణం నేపథ్యంలో సినిమా ఉంటుందని గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు నాగవంశీ అసలు విషయాన్ని చెప్పేయడంతో బన్నీ, త్రివిక్రమ్‌ల సినిమాపై ఆడియన్స్‌లో ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే.. ఇందులో బన్నీ పోషించే పాత్ర వివరాలను మాత్రం నాగవంశీ రివీల్ చేయలేదు. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నదని మాత్రం చెప్పారు. 14ఏండ్ల విరామం తర్వాత రాబోతున్న ఈ పౌరాణిక చిత్రంపై ఇప్పట్నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు మొదలయ్యాయి.