Allu Arjun | ‘పుష్ప-2’ వైల్డ్‌ఫైర్‌లా దేశాన్ని మొత్తం చుట్టేసింది. అంతేస్థాయిలో అల్లు అర్జున్ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. దాంతో ఆయన తదుపరి చిత్రాల విశేషాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అట్లీ, త్రివిక్రమ్ దర్శకత్వం వహించే చిత్రాలకు ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు అల్లు అర్జున్.
వీటిలో ఏది తొలుత సెట్స్‌మీదకు వెళ్తుందనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ రెండు చిత్రాలతో పాటు దిల్‌రాజు బ్యానర్లో అల్లు అర్జున్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్‌తో ఆర్య, పరుగు, డీజే-దువ్వాడ జగన్నాథమ్ వంటి హిట్ చిత్రాల్ని తీశారు దిల్‌రాజు.
కొన్నేళ్ల క్రితం ‘ఐకాన్’ పేరుతో అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేస్తానని ప్రకటించారాయన. శ్రీరామ్ వేణుని డైరెక్టర్‌గా అనుకున్నారు. ఎందుకోగాని ఆ సినిమా పట్టాలెక్కలేదు. సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ దిల్‌రాజుకి బన్నీ ఆఫర్ ఇచ్చారని, మంచి కథతో పాటు దర్శకుడు కుదిరితే తాను సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని దిల్‌రాజుతో బన్నీ చెప్పినట్లు టాక్ వినిపిస్తున్నది. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.