హైదరాబాద్: సంధ్య థియేటర్లో తొక్కిసలాట కేసులో ప్రముఖ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు రానున్నారు. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటిసులపై తన లీగల్ టీమ్‌తో అల్లు అర్జున్ అత్యవసరంగా సమావేశమయ్యారు. విచారణ సమయంలో పోలీసులు అడగబోయే ప్రశ్నలపై ఎలా స్పందించాలనే విషయంపై అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తున్నది.
హైకోర్టు మధ్యంతర బెయిల్‌పై ఉన్న సినీనటుడు అల్లు అర్జున్ను పోలీసులు మరోసారి విచారణకు పిలిచారు. ఈ మేరకు విచారణకు హాజరు కావాలని చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీస్ ఇచ్చారు. తొక్కిసలాట ఘటనపై ఆయనను ప్రశ్నించనున్నారు. కాగా, సంధ్య థఙయేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో మొత్తం 18 మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు. వారిలో పలువుని అరెస్టు చేశారు. కాగా, బన్నీ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు మళ్లీ అరెస్టుచేస్తారేమోనని ఆయన అభిమానులు భయపడుతున్నారు.