అగ్ర కథానాయిక రష్మిక మందన్న కెరీర్లో ‘పుష్ప’ సిరీస్ చిత్రాలు చాలా ప్రత్యేకం. శ్రీవల్లి పాత్ర ఆమెకు దేశవ్యాప్తంగా తిరుగులేని ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు ఆ క్యారెక్టర్ బాగా రీచ్ అయింది. కథానాయకుడు పుష్పరాజ్‌తో సమానంగా శ్రీవల్లి పాత్ర పాపులర్ అయిందనడం అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో ఈ సూపర్‌హిట్ కాంబో మరోసారి రిపీట్ కాబోతున్నదని సమాచారం. అల్లు అర్జున్‌తో రష్మిక మందన్న ముచ్చటగా మూడోసారి జోడీకట్టబోతున్నదని ప్రచారం జరుగుతున్నది.
వివరాల్లోకి వెళితే..అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో భారీ పాన్ వరల్డ్ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ కథాంశమిదని సమాచారం. భారీ వ్యయంతో సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నెలలోనే సెట్స్‌మీదకు వెళ్లనుందని చెబుతున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నను కథానాయికగా ఖరారు చేయబోతున్నారని తెలిసింది. ‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో బన్నీ, రష్మిక మందన్న హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకోవడంతో..అదే సెంటిమెంట్‌ను కొనసాగించాలన్నది మేకర్స్ ఆలోచనగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో విస్త్రతంగా ప్రచారం జరుగుతున్నది.