‘ ‘హాయ్ నాన్న’ మధురమైన సినిమా. నిజంగా మనసుకు హత్తుకుంది. నాని అద్భుతంగా నటించారు. గౌరవప్రదమైన కథను తయారుచేసిన దర్శకుడికి నా అభినందనలు. మృణాళ్.. తెరపై నీ స్వీట్నెస్ నన్ను ఇప్పటికీ వెంటాడుతున్నది. బేబీ కియారా.. మై డార్లింగ్.. నీ క్యూట్‌నెస్‌తో మనసుని ఆకట్టుకున్నావ్.. ఇక స్కూల్‌కి వెళ్లు.. ఈ సినిమాకు పనిచేసిన మిగతా ఆర్టస్టులకూ, సాంకేతికనిపుణులకూ నా అభినందనలు’ అని అల్లు అర్జున్ అన్నారు. నాని, మృణాళ్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకుడు. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్‌రెడ్డి నిర్మాతలు. ఇటీవల విడుదలైన ఈ చిత్రాన్ని వీక్షించిన అగ్రహీరో అల్లు అర్జున్ యూనిట్ సభ్యులందర్నీ ప్రశంసిస్తూ మెసేజ్ పోస్ట్ చేశారు.
‘సను వర్గీస్ ఛాయాగ్రహణం, హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం నిజంగా నెక్ట్స్ లెవల్. ఇక దర్శకుడు శౌర్యువ్ తొలి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆనందభాష్పాలు తెప్పించే మూమెంట్స్ సృష్టించారు. ‘హాయ్ నాన్న’ నాన్నలనే కాదు, కుటుంబంలోని అందరి మనసులనూ హత్తుకునే సినిమా’ అని అల్లు అర్జున్ మెసేజ్ చేశారు. ఇదిలావుంటే అల్లు అర్జున్ అభినందనలకు హీరో నాని వెంటనే ధన్యవాదాలు తెలిపారు. ‘అర్హ నాన్న ఆమోదించారు. థ్యాంక్యూ సోమచ్ డియర్ బన్నీ. మంచి సినిమా కోసం నువ్వు ఎప్పుడూ ఉంటావు’ అని నాని బదులిచ్చారు. ప్రస్తుతం నాని ‘హాయ్ నాన్న’ ప్రమోషన్లో భాగంగా యూఎస్ఏలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా నాలుగురోజుల్లో ‘హాయ్ నాన్న’ 40కోట్ల గ్రాస్ వసూలు చేసింది.