Allu Arjun Emotional | అల్లు కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ నానమ్మ, అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కనకరత్నమ్మ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో అల్లు కుటుంబంతో పాటు మెగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇక నానమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ ముంబైలో తన సినిమా షూటింగ్‌ను మధ్యలో ఆపేసి హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు. అనంతరం నానమ్మ మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ తన తల్లి మరణంతో శోకసంద్రంలో ఉన్న అల్లు అరవింద్, అలాగే తీవ్ర దుఃఖంలో ఉన్న అల్లు అర్జున్ను చిరంజీవి ఓదార్చారు. ఇక నానమ్మ మీద ఉన్న ప్రేమతో అల్లు అర్జున్ చిరంజీవి ఎదుట కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.