Allu Arjun | ‘పుష్ప-2’ వంటి పాన్ ఇండియా బ్లాక్బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే తదుపరి సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికైతే త్రివిక్రమ్, అట్లీ సినిమాలు లైనప్లో ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా ఓ ప్రాజెక్ట్ అనుకుంటున్నారు. వీటిలో అట్లీ సినిమా తొలుత పట్టాలెక్కే అవకాశముందని ఫిల్మ్సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బన్నీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన వస్తేనే కానీ ఈ విషయంలో స్పష్టత రాదంటున్నారు.
ఇదిలా వుండగా అట్లీ- అల్లు అర్జున్ సినిమాపై ఓ ఆసక్తికరమైన వార్త సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్లో కనిపిస్తారట. ఇదేగనుక నిజమైతే కెరీర్లో ఆయనకిది తొలి ద్విపాత్రాభినయం అవుతుంది. కమర్షియల్ చిత్రాలను తనదైన శైలిలో భారీ హంగులతో తెరకెక్కించడం దర్శకుడు అట్లీ శైలి. ఇక ‘పుష్ప‘ సిరీస్ చిత్రాలతో తన మాస్ ప్రజెన్స్ ఎలా ఉంటుందో నిరూపించారు బన్నీ. మరి వీరిద్దరి కలయికలో సినిమా అంటే ఇక అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పక్కర్లేదని అభిమానులు అనుకుంటున్నారు.