Allu Arjun | చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ శుక్రవారం విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తున్నది. సంధ్య థియేటర్ కేసులో ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులు ఇంకా జైలు అధికారులకు అందలేదని సమాచారం. ఈ క్రమంలో పుష్ప నటుడి విడుదల ఆలస్యమవుతున్నది. అయితే, శుక్రవారం బన్నీ బయటకు వచ్చే అవకాశం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దాంతో ఆయన ఇవాళ జైలులోనే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అధికారికంగా కోర్టు ఉత్తర్వులు తమకు అందలేదని జైలు అధికారులు పేర్కొంటున్నారు. బెయిల్ ఉత్తర్వు కాపీలు ఇంకా ఆన్లైన్లో అప్లోడ్ కాలేదని జైలు అధికారులు చెబుతున్నారు. అల్లు అర్జున్ తరఫు లాయర్లు తీసుకువచ్చిన బెయిల్ కాపీ సరిగా లేదని పేర్కొన్నారు.
బెయిల్ కాపీలో తప్పులు ఉన్నాయని.. వాటిని సరిదిద్దుతున్నట్లు సమాచారం. అదే సమయంలో పూచీకత్తు చెల్లించడంలోనూ ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తున్నది. దాంతో అల్లు అర్జున్ విడుదల ఆలస్యమవుతున్నది. మొత్తంగా వ్యవహారం గమనిస్తే ఇవాళ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు లేవని సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలులోని మంజీరా బ్లాక్‌లో ఉన్నట్లు సమాచారం. ఆయన విడుదల జాప్యం నేపథ్యంలో క్లాస్-1 బ్యారక్‌ను జైలు అధికారులు సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. రాత్రి 10గంటల వరకు బెయిల్ పత్రాలు అందితేనే విడుదలయ్యేందుకు అవకాశం ఉంటుందని.. లేకపోతే బన్నీ జైలులో ఉండక తప్పదని సమాచారం. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇవాళ జైలు నుంచి బయటకు వస్తాడా? లేదా..? రాత్రి జైలులోనే గడపాల్సి వస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మరో వైపు అల్లు అర్జున్ అభిమానులు చంచల్‌గూడ జైలుకు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అదే సమయంలో అల్లు అర్జున్ ఇంటి వద్దకు సినీరంగ ప్రముఖులు చేరుకున్నారు.