అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప-2’ (ది రూల్) తెరకెక్కుతున్నది. అల్లు అర్జున్ జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని ఇటీవల విడుదల చేసిన ‘హంట్ ఫర్ పుష్ప’ వీడియో సోషల్‌మీడియాలో రికార్డులు సృష్టించింది. దాంతో సీక్వెల్‌పై దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ చిత్రాల సిరీస్‌ను ఓ ఫ్రాంఛైజీగా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని, ‘పుష్ప-3’ (ది రూల్ బిగిన్స్) పేరుతో మూడో భాగానికి కూడా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
కొన్ని నెలల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటించిన ఫహాద్ ఫాజిల్ సైతం ‘పుష్ప-3’ ఉండబోతుందనే సంకేతాలిచ్చారు. ఓ వైపు ‘పుష్ప-2’ చిత్రీకరణలో ఉండగానే మూడో భాగం గురించి పరిశ్రమ వర్గాలతో పాటు సోషల్‌మీడియాలో ఆసక్తికరమై చర్చ నడుస్తుండటం విశేషం. అయితే ‘పుష్ప-3’ సినిమా విషయంలో నిజానిజాలేమిటో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు.