Allu Arjun File A Petition | టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసు విషయంలో అల్లు అర్జున్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును క్యాష్ చేయాలని అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ నంద్యాల శాసనసభ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఇంటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అయితే ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నంద్యాలలో అల్లు అర్జున్, శిల్పా రవి ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులకు రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. ఆర్వో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అల్లు అర్జున్, శిల్పా రవిలపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద ఈ కేసు నమోదు చేశారు. క్రైమ్ నంబర్ 71/2024గా కేసు రిజిస్టర్ చేసినట్టు సమాచారం.
కాగా అల్లు అర్జున్ తన భార్య స్నేహరెడ్డిని కూడా వెంటబెట్టుకొని నంద్యాలలోని శిల్ప రవి ఇంటికి వెళ్లారు. శిల్పారవి తనకు మంచి మిత్రుడని, తాము ఎప్పుడు కలిసినా అతడు నంద్యాల గురించే అలోచిస్తాడని అల్లు అర్జున్ అన్నారు. ‘‘ నా స్నేహితులు ఎక్కడ ఏ ఫీల్డ్‌లో ఉన్నా వాళ్ల కోసం వెళ్తా. శిల్పారవి 2019లో మొదటిసారి పోటీ చేసినప్పుడు నేను ఒక సందేశం మాత్రమే పంపాను. ఎమ్మెల్యే శిల్పా రవి వద్దన్నా కూడా నేనే అభినందించడానికి, విషెస్ చెప్పడానికి నంద్యాలకు వచ్చాను. ఇప్పుడు నేరుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. శిల్పా రవిని మంచి మెజార్టీతో గెలుపొందాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని అల్లు అర్జున్ అన్నారు.