Ram Charan-Allu Arjun | గత కొద్ది రోజులుగా మెగా- అల్లు వివాదం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ .. వైసీపీ అభ్యర్ధికి మద్దతు తెలపడంతో మెగా- అల్లు ఫ్యామిలీ మధ్య వివాదం బయటపడింది. మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్‌గా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి అనే వ్యక్తికి సపోర్ట్ చేశాడు. ఆ సమయంలో మెగా- అల్లు మధ్య ఏదో విభేదాలు తలెత్తాయనే ప్రచారం నడిచింది. ఇక పుష్ప-2 సినిమా సమయంలో కూడా ఆయనకు వ్యతిరేకంగా మెగా అభిమానులు, కూటమి ఎమ్మెల్యేలు మాట్లాడటంతో ఈ వివాదం వేడెక్కింది.
పుష్ప2 సినిమా మంచి హిట్ అయితే మెగా ఫ్యామిలీ నుండి ఏ హీరో కూడా దానిపై స్పందించింది లేదు. ఇక బన్నీ అరెస్ట్ విషయంలోను మెగా హీరోలు సైలెంట్‌గానే ఉన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే మెగా , అల్లు ఫ్యామిలీ మధ్య దూరం మరింత పెరిగినట్టు అయింది. ఇక గురువారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు కాగా, ఆయనకి ఇండస్ట్రీ నుండే కాక సొంత ఫ్యామిలీ నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాని అల్లు అర్జున్ నుండి మాత్రం రామ్ చరణ్‌కి ఎలాంటి విషెస్ అందలేదు. ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాల వల్లనే అల్లు అర్జున్.. రామ్ చరణ్‌కి విషెస్ తెలపలేదని కొందరు కామెంట్ చేస్తున్నారు.
చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య ఎప్పటి నుండో మంచి అనుబంధం ఉంది. ఇప్పటి వరకు వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు రాలేదు. అటు అల్లు అర్జున్ తన మేనత్తను చాలా అభిమానిస్తాడు. రామ్ చరణ్ కూడా తన మేనమామ అరవింద్ ని ఎంతో ఇష్టపడతారు. అల్లు అరవింద్ తో తాను సరదాగా ఉంటానని, పార్టీలకి పబ్లకి అతనితోనే కలిసి వెళతానని ఓ ఇంటర్వ్యూలో కూడా రామ్ చరణ్ చెప్పారు. మరి అందరు బాగానే ఉన్నా చరణ్ బన్నీల మధ్యే ఎందుకు ఈ గ్యాప్ అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ను రామ్ చరణ్ అన్‌ఫాలో చేసిన కారణంగానే రామ్ చరణ్‌కు పుట్టిన రోజుకి అల్లు అర్జున్ రియాక్ట్ కాలేదని తెలుస్తోంది. మరోవైపు రామ్ చరణ్ భార్య ఉపాసన మాత్రం అల్లు అర్జున్ను ఫాలో అవుతూనే ఉన్నారు.