Allu Arjun | పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీపై అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం పడినట్టు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా షెడ్యూల్ మార్పులు చోటుచేసుకున్నాయి. హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ముంబైలో వేసిన భారీ సెట్స్‌లో కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక తదుపరి షెడ్యూల్‌ను దుబాయ్‌లో ప్లాన్ చేశారు. అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) తర్వాత అక్కడ షూటింగ్ ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నారు.
అయితే, ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు గల్ఫ్ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో భద్రతా సమస్యలు, విమాన సర్వీసుల అంతరాయం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. పలు వ్యాపార కార్యకలాపాలు కూడా మందగించాయి. ఈ పరిస్థితుల్లో దుబాయ్‌లో షూటింగ్ నిర్వహించడం కష్టసాధ్యంగా మారడంతో, చిత్ర బృందం ఆ షెడ్యూల్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు సమాచారం. యుద్ధ పరిస్థితులు సద్దుమణిగే వరకు వేచి చూడాలా లేదా కొత్త లొకేషన్ ఎంపిక చేయాలా అనే అంశంపై మేకర్స్ ఆలోచనలో ఉన్నారు.గత కొంతకాలంగా అంతర్జాతీయ పరిస్థితులు భారత సినీ పరిశ్రమపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో భారీ మార్కెట్ ఉన్న తెలుగు సినిమాలకు ఇది కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు అదే ప్రభావం నేరుగా భారీ ప్రాజెక్ట్‌ల షూటింగ్‌లపై పడటం గమనార్హం.
అల్లు అర్జున్- అట్లీ సినిమా వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కూడా అంతర్జాతీయ పరిణామాల వల్ల ప్రభావితమవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక షూటింగ్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇక ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ బన్నీ బర్త్ డే సందర్భంగా బయటకు రానుంది. దాని కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.