అల్లు అర్జున్ – అట్లీ సినిమా ప్రకటన వచ్చిన నాటి నుంచి ఈ సినిమాపై ఎలాంటి వార్త బయటికి పొక్కినా క్షణాల్లో వైరల్ అయిపోతున్నది. ఆ ప్రాజెక్ట్కున్న క్రేజ్ అలాంటిది. ముఖ్యంగా బన్నీ రోల్‌పై కొన్ని రోజులుగా రకరకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అల్లు అర్జున్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారని, వాటిలో ఓ పాత్ర నెగటీవ్ షేడ్స్‌తో ఉంటుందనే వార్త అయితే.. సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయ్యింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త సినీ ప్రియుల్ని, అందునా ముఖ్యంగా బన్నీ అభిమానుల్ని ఆశ్చర్యానికీ, ఆనందానికీ గురిచేస్తున్నది. వివరాల్లోకెళ్తే.. మునుపెన్నడూ చేయని విధంగా అల్లు అర్జున్ ఈ సినిమాలో నాలుగు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారట. అవి కూడా మూడు తరాలకు చెందిన పాత్రలని సమాచారం.
అంటే.. తాతగా, తండ్రిగా, ఇద్దరు కుమారులుగా మూడు తరాలకు చెందిన నలుగురు వ్యక్తులుగా బన్నీ ఇందులో కనిపిస్తారన్నమాట. అట్లీ ఆలోచనకు ఫిదా అయిపోయిన బన్నీ ఆయా లుక్స్‌లో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారట. బాలీవుడ్ మీడియాలో ప్రచురితమైన ఈ కథనాలు ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశమయ్యాయి. ఈ కథనాలే నిజమైతే.. బన్నీ ఫ్యాన్స్‌కి ఈ సినిమా ఓ కనుల పంటే.