Allu Arjun- Atlee |‘పుష్ప–2’తో దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు తన తదుపరి అడుగును అంతర్జాతీయ స్థాయిలో వేయడానికి సిద్ధమవుతున్నారు. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్, సాధారణ కమర్షియల్ సినిమాకు మించి, గ్లోబల్ ఆడియెన్స్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందుతోంది. ఈ చిత్రం కోసం ఇప్పటివరకు ఇండియన్ సినిమాల్లో అరుదుగా వాడిన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, హై-ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్‌ను ఉపయోగిస్తున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా టెక్నికల్ టీమ్ పనిచేస్తుండటంతో, ఈ సినిమా విజువల్ వండర్‌గా నిలుస్తుందని అంచనాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అట్లీ మాట్లాడుతూ, త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక ప్రకటన రాబోతుందని, అది అభిమానులను ఊహించని స్థాయిలో ఉత్సాహపరుస్తుందని తెలిపారు. అలాగే దీపికా పదుకొణెపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘జవాన్’ తర్వాత ఆమెతో చేస్తున్న రెండో సినిమా ఇదేనని, తల్లైన తర్వాత దీపికా నటిస్తున్న తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషమన్నారు. ఈ సినిమాలో ఆమె పాత్ర పూర్తిగా కొత్త కోణంలో ఉంటుందని, నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని చెప్పారు.ఈ ప్రాజెక్ట్‌లో దీపికాతో పాటు మరో ఇద్దరు కథానాయికలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా రష్మిక మందన్న విభిన్నమైన, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, యోగిబాబు వంటి నటులు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. సంగీత బాధ్యతలను సాయి అభ్యంకర్ నిర్వహిస్తున్నారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుదలకు ముందే భారీ ఓటీటీ డీల్ కుదిరిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నటీనటులు, టెక్నికల్ టీమ్, నిర్మాణ విలువలు అన్నీ కలిస్తే, ఈ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్‌ను సునాయాసంగా చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అట్లీ మాస్ టచ్‌కు అల్లు అర్జున్ స్టైల్ జత కలిస్తే, వెండితెరపై ఎలాంటి సంచలనం సృష్టించబోతోందో చూడాలంటే సినిమా విడుదల వరకు ఎదురుచూడాల్సిందే. అభిమానులు మాత్రం ఈ కాంబో భారతీయ సినిమాను ప్రపంచ పటంలో మరో మెట్టు పైకి తీసుకెళ్తుందని ధీమాగా చెబుతున్నారు.