అల్లు అర్జున్ కథానాయకుడిగా రూపొందిన ‘పుష్ప2’ సినిమా గురువారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీమియర్ సందర్భంగా అల్లు అర్జున్ అండ్ టీమ్ హైదరాబాద్ సంధ్య థియేటర్‌కు రావడంతో అక్కడ జరిగిన తొక్కిసలాట కారణంగా రేవతి అనే ఓ మహిళ మృతి చెందారు. ఈ విషయంపై శుక్రవారం అల్లు అర్జున్ స్పందిస్తూ సోషల్‌మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు.
‘మేం ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కి వెళ్లాం. అక్కడ జరిగిన తొక్కిసలాటలో కొందరికి దెబ్బలు తగిలాయని తెలిసింది. రేవతి అనే మహిళ మృతి చెందిందనీ, ఆమె కుమారుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయని తెలియగానే షాక్‌కు గురయ్యాను. థియేటర్‌కి వెళ్లి అభిమానులతో కలిసి సినిమా చూడటం 20ఏళ్లుగా నాకు అలవాటు.
ఆ ఆనవాయితీ ప్రకారం వెళ్లాను. కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని మాత్రం అనుకోలేదు. ఇది నన్ను తీవ్రంగా కలచివేసింది. రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మేం ఎంత చేసినా ఆ కుటుంబానికి ఎదురైన లోటుని పూడ్చలేం. నా వంతు పరిహారంగా 25లక్షలు వారి కుటుంబానికి అందజేస్తున్నాను. అంతేకాక ఆమె కుమారుడి మెడికల్ ఖర్చులు కూడా భరిస్తానని తెలియజేస్తున్నాను. ఇక ఆ కుటుంబం బాధ్యత నాదే.’ అని తెలిపారు.