‘సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాను. అందులో దాపరికం లేదు. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా ద్వారా నేను సంపాదించాలనుకున్నది డబ్బు కాదు. సంతృప్తి’ అన్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఆయన సమర్పకుడిగా వ్యవహరించిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. రష్మిక మందన్న, దీక్షిత్‌శెట్టి ప్రధాన పాత్రల్లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ నెల 7న తెలుగు..14న తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘ఈ కథ విన్నప్పుడు మనకు తెలిసిన కొన్ని చెప్పలేని నిజాలను చెప్పాలనిపించింది. పాటలు, ఫైట్స్, జోక్స్ ఎన్ని ఉన్నాయో అంటూ లెక్కలు వేసుకొని చూసే సినిమా కాదిది. స్త్రీపురుష సంబంధాలను కొత్త కోణంలో ఆవిష్కరిస్తుంది. సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకుల్ని నిద్రపట్టకుండా చేస్తాయి. అంతలా వారి హృదయాలను వెంటాడే సినిమా ఇది’ అని అల్లు అరవింద్ చెప్పారు.
ఈ సినిమా షూటింగ్ టైమ్‌లోనే అల్లు అరవింద్ తనకు మరో సినిమాకు అడ్వాన్స్ ఇచ్చారని, ఆయన ఇచ్చింది డబ్బు కాదు..ధైర్యం అని హీరో దీక్షిత్‌శెట్టి పేర్కొన్నారు. తన కెరీర్లో బ్యూటీఫుల్ మూవీగా మిగిలిపోతుందని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ అన్నారు. ఎన్నో విలువలు కలబోసిన సినిమా ఇదని, ప్రతీ ఒక్కరు కుటుంబంతో కలిసి థియేటర్లలో సినిమా చూడాలని నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.