“ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాకు అంతటా మంచి స్పందన లభిస్తున్నది. స్త్రీపురుష సంబంధాల్లోని సంఘర్షణను ఈ చిత్రం ద్వారా తెలియజెప్పాం. మహిళలు పడే ఆవేదనను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు దర్శకుడు’ అని అన్నారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ పతాకంపై ఆయన సమర్పణలో రూపొందిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. రష్మిక మందన్న, దీక్షిత్‌శెట్టి ప్రధాన పాత్రల్లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ ‘ఈ సినిమా చూశాక తమలో ధైర్యం పెరిగిందని చాలా మంది అమ్మాయిలు మెసేజ్‌లు పెడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే దర్శకుడిగా నేను మరో సినిమా చేయకున్నా ఫర్వాలేదు అనేంత సంతృప్తి కలిగింది.’ అని చెప్పారు. ఈ సినిమా చూసిన చాలామంది భావోద్వేగంతో కన్నీళ్లను ఆపుకోలేకపోతున్నారని, ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారని నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి పేర్కొన్నారు.