Allu Aravind | కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఇండియన్ సినీ పరిశ్రమను షేక్ చేసిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఇప్పుడు వినూత్న మార్గంలో అడుగులు వేసింది. పౌరాణిక నేపథ్యాన్ని ఆధారంగా తీసుకుని, పూర్తిగా యానిమేషన్ టెక్నాలజీతో మహావతార్ నరసింహ అనే చిత్రం రూపొందించారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆధ్యాత్మిక లోకంలోకి తేవడమే కాకుండా, కొత్త రికార్డులను సృష్టిస్తోంది.ఇప్పటి వరకూ మాస్, కమర్షియల్ సినిమాలపై దృష్టి పెట్టిన హోంబలే ఫిలింస్ ఈసారి సనాతన హిందూ పురాణ గాథను 3D యానిమేషన్ రూపంలో తెరపై ఆవిష్కరించింది. ఫలితంగా థియేటర్లలో సినిమాను వీక్షించిన ప్రేక్షకులు భక్తి పారవశ్యంలో మునిగిపోతూ, హారతులు ఇస్తూ, పాటలు, కీర్తనలు ఆలపిస్తూ, ఒక పవిత్ర అనుభూతిని సొంతం చేసుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విడుదలైన తర్వాత రోజు థియేటర్లలోకి వచ్చినా, ‘మహావతార్ నరసింహ’ నెమ్మదిగా పుంజుకుని, మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద జోరు పెంచింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, యానిమేటెడ్ సినిమాల విభాగంలో కొత్త మైలురాయిని సాధించింది. తెలుగులో ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించగా, ఆయన సక్సెస్‌ను దృష్టిలో ఉంచుకుని సండే సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు అశ్వినీ కుమార్, నిర్మాత అల్లు అరవింద్, రచయితలు తనికెళ్ల భరణి, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినిమా చూసిన అనంతరం అందరూ తమ భక్తిశ్రద్ధలతో కూడిన అనుభూతులను పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు తెలిసి మా సన్నిహితులల్లో గానీ, కుటుంబాల్లో గానీ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్‌కు ఉన్న జ్ఞానం అంతగా మరెవరికీ లేదు. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే మేమంతా వింటూ మంత్రముగ్ధులమవుతాం. ఆయన ఈ ‘మహావతార్ నరసింహ’ సినిమా చూడాలని, దీనిపై మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు. అల్లు అరవింద్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పౌరాణిక అంశాలను ఆధునిక సాంకేతికతతో మిళితం చేస్తూ, ప్రేక్షకుల మనసులను హత్తుకున్న ఈ చిత్రం భారత యానిమేషన్ రంగానికి కొత్త దిశను సూచిస్తూ, సంచలనం సృష్టిస్తోంది.