గత కొన్నేళ్లుగా వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకొని ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న హీరో అల్లరి నరేష్ మరో యూనిక్ కాన్సెప్ట్‌తో రాబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘12ఏ రైల్వే కాలనీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నాని కాసరగడ్డ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘పొలిమేర’ ఫేమ్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. సోమవారం టైటిల్‌తో పాటు టీజర్‌ను విడుదల చేశారు. అల్లరి నరేష్ ఓ కిటీకి దగ్గర నిల్చొని దీర్ఘాలోచనలో కనిపిస్తున్న సన్నివేశంతో ఆరంభమైన టీజర్ ఉత్కంఠను పంచింది.
కొంతమందికి మాత్రమే ఆత్మలు ఎందుకు కనిపిస్తాయి? జరగబోయే అతీంద్రియ సంఘటనల వెనక ఎలాంటి కారణం ఉంటుందనే ప్రశ్నలతో టీజర్ ఆసక్తికరంగా సాగింది. చివరగా అల్లరి నరేష్ ఒక వ్యక్తిని చంపి నవ్వుతుండటం ఆయన పాత్రపై మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసేలా ఉంది. ఈ వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: పవన్‌కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, షోరన్నర్: డాక్టర్ అనిల్ విశ్వనాథ్, దర్శకత్వం: నాని కాసరగడ్డ.