కెరీర్ ప్రారంభమైన నాటినుంచి కామెడీ సినిమాలకే పెద్ద పీట వేస్తూ యాభై పైచిలుకు చిత్రాలు పూర్తిచేసేశారు అల్లరి నరేశ్. సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యాక, కామెడీని పక్కనపెట్టి సీరియస్ సబ్జెక్టులను ఎంచుకుంటూ నటుడిగా కూడా సత్తా చాటుతూ వచ్చారు. కాగా, ఇప్పుడు మళ్లీ కామెడీ జానర్‌కి తిరిగివచ్చారాయన. మల్లి అంకం దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘ఆ ఒక్కటీ అడక్కు’పేరుతో సినిమా చేస్తున్నారు అల్లరి నరేశ్.
రాజీవ్ చిలక నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌తోపాటు ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా ఇప్పటికీ చాలామందికి అభిమాన చిత్రం. ఇప్పుడు ఆయన తనయుడు అల్లరి నరేశ్ అదే పేరుతో సినిమా చేయడం ఇక్కడ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. ఇందులో గణ అనే పాత్రను పోషిస్తున్నారు నరేశ్. అతని పెళ్లి గురించి ఇంట్లోవాళ్లూ, బయట మిత్రులు అడగడంతో ‘ఆ ఒక్కటీ అడక్కు’ అని ‘పెళ్లి అనేది పాన్ ఇండియా సమస్య’ అని చెప్పడం గ్లింప్స్‌లో హైలైట్. వచ్చే నెల 22న విడుదల కానున్న ఈ చిత్రంలో ‘జాతిరత్నాలు’ఫేం ఫరియా అబ్దుల్లా కథానాయిక. ఈ చిత్రానికి కెమెరా సూర్య, సంగీతం: గోపీసుందర్.