వినూత్న కథా చిత్రాలతో మెప్పించే అల్లరి నరేష్ తాజాగా యాక్షన్ థ్రిల్లర్ ‘12ఏ రైల్వే కాలనీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. నాని కాసరగడ్డ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ‘పొలిమేర’ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం విడుదలకానుంది. శుక్రవారం మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టారు. ‘కన్నొదిలి కలనొదిలి..’ అనే పాటను విడుదల చేశారు.
‘కన్నొదిలి కలనొదిలి కనుపాపే ఉంటుందా..నిన్నొదిలి నేకదిలి కాసేపైనా ఉంటానా..’ అంటూ చక్కటి భావాలతో ఈ పాట ఆకట్టుకుంది. భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన ఈ పాటను హేషమ్ అబ్దుల్ వహాబ్ ఆలపించారు. ఈ పాటలో నాయకానాయికలు అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల మధ్య కెమిస్ట్రీ ప్రత్యేకాకర్షణగా నిలిచింది. సాయికుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, షోరన్నర్: డాక్టర్ అనిల్ విశ్వనాథ్, దర్శకత్వం: నాని కాసరగడ్డ.