‘డార్లింగ్స్’ సినిమాతో నిర్మాతగా అరంగేట్రం చేసింది బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియాభట్. కమర్షియల్గా ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోయినా…నిర్మాతగా ఎన్నో కొత్త విషయాల్ని తెలుసుకున్నానని అలియాభట్ పేర్కొంది. ఇటీవల ఫోర్బ్స్ పోడియమ్ షోకు హాజరైన ఆమె తన తొలి చిత్ర నిర్మాణం తాలూకు అనేక ఆసక్తికరమైన అంశాల్ని పంచుకుంది. ఈ సినిమా బడ్జెట్ కోసం తాను బ్యాంకు నుంచి రుణాన్ని తీసుకోలేదని, పారితోషికం లేకుండా నటించడంతో డబ్బులు సర్దుబాటు అయ్యాయని తెలిపింది. ఆమె మాట్లాడుతూ ‘లాభాల మీద ధ్యాస కంటే సినీ నిర్మాణం తాలూకు కష్టనష్టాల్ని తెలుసుకోవాలనే లక్ష్యంతో నిర్మాతగా మారాను. పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా ఫిల్మ్ ప్రొడక్షన్స్ గురించిన ప్రాథమిక అంశాల మీద కూడా నాకు అవగాహన లేదు. ‘డార్లింగ్స్’ ద్వారా సినీ ట్రేడ్ గురించి చాలా విషయాలు తెలిశాయి. కెమెరా వెనక ఇంత తతంగం ఉంటుందా అని ఆశ్చర్యమేసింది. భవిష్యత్తులో నిర్మాతగా కొనసాగుతూ సాధారణ ప్రజలకు కనెక్ట్ అయ్యే సినిమాలు తీస్తాను’ అని పేర్కొంది.