ముంబై: బాలీవుడ్ నటి ఆలియా భట్(Alia Bhatt)కు చెందిన పర్సనల్ అసిస్టెంట్ వేదికా ప్రకాశ్ శెట్టిపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఆలియా నుంచి ఆమె అక్రమ రీతిలో 77 లక్షలు కాజేసినట్లు తెలిసింది. ఆ కేసులో వేదికా ప్రకాశ్ శెట్టిని అరెస్టు చేశారు. ఆలియాకు చెందిన ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో పాటు పర్సనల్ అకౌంట్ల నుంచి ఆ మొత్తాన్ని కాజేసినట్లు తెలుస్తోంది. మే 2022 నుంచి ఆగస్టు 2024 మధ్యలో ఈ నేరం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆలియా తల్లి, ఆర్ట్ డైరెక్టర్ సోని రజ్దాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విషయం బయటపడింది. జనవరి 23వ తేదీన జూహూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. చీటింగ్ కేసు నమోదు అయిన తర్వాత వేదికా శెట్టిని అరెస్టు చేశారు. 2021 నుంచి 2024 వరకు ఆలియా భట్‌కు పర్సనల్ అసిస్టెంట్‌గా వేదికా శెట్టి పనిచేసింది. ఆ సమయంలో నటి ఆలియాకు చెందిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు, పేమెంట్లు, షెడ్యూల్ ప్లానింగ్ చూసుకున్నది.
నకిలీ బిల్లులు సృష్టించి ఆలియా భట్ సంతకం తీసుకుని డబ్బును లూటీ చేసినట్లు దర్యాప్తులో తేల్చారు. ట్రావెల్, మీటింగ్‌లు, ఇతర నిర్వహణ కోసం ఆ డబ్బును ఖర్చు చేస్తున్నట్లు ఆమె చెప్పేదని పోలీసులు వెల్లడించారు. ఆలియా సంతకం చేసిన తర్వాత ఆ అమౌంట్ తన స్నేహితురాలికి ట్రాన్స్ఫర్ అయ్యేదని, ఆ తర్వాత మళ్లీ వేదికా శెట్టి అకౌంట్లోకి ఆ డబ్బు వెళ్లేదని పోలీసులు తేల్చారు. ఆలియా తల్లి ఫిర్యాదు చేసిన తర్వాత.. వేదికా శెట్టి పరారీలో ఉంది. రాజస్థాన్, కర్నాటక, పుణె, బెంగుళూరుకు వెళ్లింది. అయితే బెంగుళూరులో ఆమెను జూహూ పోలీసులు అరెస్టు చేశారు. ట్రాన్సిట్ రిమాండ్‌పై ఆమెను అదుపులోకి తీసుకున్నారు.