Jigra Movie | స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ (Student of the Year) సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది నటి అలియా భట్(Alia Bhatt). కరణ జోహార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో అలియాకు మంచి మార్కులు పడ్డాయి. అనంతరం హైవే అంటూ ప్రయోగాత్మక చిత్రంలో నటించి ప్రశంసలు అందుకోవడమే కాకుండా అవార్డులు కూడా అందుకుంది. ఆ తర్వాత 2 స్టేట్స్, ఉడ్తా పంజాబ్, గల్లీ బాయ్ చిత్రాల్లో తన నటనతో మెప్పించింది. ఇక సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన గంగూబాయ్ కతియావాడీ సినిమాకు గాను నేషనల్ అవార్డు అందుకుంది ఈ భామ.
అయితే తాజాగా అలియా లీడ్ రోల్లో వచ్చిన చిత్రం ‘జిగ్రా’ (JIGRA). ఈ సినిమాకు వసన్ బాల దర్శకత్వం వహించగా.. ధర్మ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అలియా భట్, షాహీన్ భట్ & సోమెన్ మిశ్రా సంయుక్తంగా నిర్మించారు. బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో అలియా భట్ అక్కగా నటించగా.. వేదాంగ్ రైనా తమ్ముడి పాత్రలో నటించాడు. టాలీవుడ్ నటుడు రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలో మెరిశాడు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్ అందుకుంది. అయితే జిగ్రా ఫ్లాప్‌పై తొలిసారి స్పందించింది అలియా.
అలియా మాట్లాడుతూ.. ‘జిగ్రా’ ఫ్లాప్ అయినప్పటికీ తనకు ఒక ముఖ్యమైన అనుభవంగా నిలిచిందని అలియా పేర్కొంది. ప్రతి సినిమా ఒక పాఠం. ‘జిగ్రా’ నాకు చాలా దగ్గరైన ప్రాజెక్ట్, మరియు దాని ఫలితం ఆశించిన విధంగా లేకపోయినా, దాని ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఈ సినిమా నన్ను మరింత దృఢంగా చేయడంతో పాటు ధైర్యాన్ని ఇచ్చింది. ఈ సినిమా నాకు భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన పాత్రలను పోషించేందుకు ప్రేరణగా నిలిచిందని అలియా తెలిపింది.