ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ‘మిమీ’ చిత్రానికిగాను ఉత్తమ నటిగా పురస్కారాన్ని గెలుచుకుంది కృతిసనన్. ‘గంగూబాయి కఠియావాడి’ చిత్రంలో నటించిన అలియాభట్‌తో కలిసి కృతిసనన్ ఈ పురస్కారాన్ని పంచుకుంది. జాతీయ అవార్డుతో తన చిరకాల స్వప్నం నెరవేరిందని కృతిసనన్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన తనలాంటి వారు అవార్డు గెలుచుకోవడం ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తుందని కృతిసనన్ పేర్కొంది.
ఆమె మాట్లాడుతూ ‘అవార్డు వచ్చిందని తెలియగానే పట్టరాని సంతోషం కలిగింది. మా కుటుంబ సభ్యులందరితో కలిసి డ్యాన్సులు చేస్తూ రోజంతా ఉత్సాహంగా గడిపాను. జాతీయ అవార్డు గురించి ఎప్పటి నుంచో కలలు కంటున్నా. ఎప్పటికైనా జాతీయ పురస్కారం సాధించాలని 2020లోనే నా డైరీలో రాసుకున్నా. అది ఇప్పుడు నిజమైంది. అవార్డు వచ్చినంత మాత్రాన నేనేదో సాధించానని అనుకోవడం లేదు. ఇండస్ట్రీలో నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ హిందీలో పలు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.