Ali Fazal | మీర్జాపూర్ వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ ప్రస్తుతం రెండు విభిన్నమైన చిత్ర ప్రాజెక్టులతో సందడి చేస్తున్నారు. రాజ్ అండ్ డీకే నిర్మాణంలో, ఫాంటసీ పీరియడ్ డ్రామాగా రూపొందుతున్న రక్త్ బ్రహ్మాండ్ సిరీస్‌లో ఒక రాజు పాత్రలో కనిపించనుండగా, ప్రోసిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక ఉత్కంఠభరిత క్రైమ్ థ్రిల్లర్‌లో రియాలిటీకి దగ్గరగా ఉండే పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్టుల మధ్య తనను తాను మాససికంగా ఛేంజ్ చేసుకోవడం అనేది భారీ సవాలుగా మారినట్లు అలీ ఫజల్ వెల్లడించారు.
నేను ఎప్పుడూ సవాళ్లను ఆస్వాదించే కథల వైపు అట్రాక్ట్ అవుతాను. ‘రక్త్ బ్రహ్మాండ్’ ఇక పిరియాడికల్ డ్రామా. నేను ఇప్పటివరకు అసలు చూడని ప్రాజెక్ట్. మరోవైపు ప్రోసిత్ రాయ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం భావోద్వేగాలతో ముడిపడి ఉంది. ఈ రెండు ప్రాజెక్ట్‌లు ఓకే సమయంలో షూటింగ్‌లు జరుపుకుంటుడటం వలన ఒక పాత్ర అవ్వగానే ఇంకో పాత్రలోకి వేగంగా ప్రవేశించాల్సి ఉంటుంది. ఇది నాకు చాలా సవాలుతో కూడుకున్నది. అయినా కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఊహించని దానిని ఎదుర్కొని, నా నటనా వృత్తిలో నన్ను నేను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం అని అలీ ఫజల్ తెలిపాడు. ఈ రెండు పాత్రలు నాకు భిన్నమైన సవాళ్లను అందించాయి. ‘రక్త్ బ్రహ్మాండ్’ కోసం నేను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా సిద్ధమయ్యాను. ఇది నా కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని నమ్ముతున్నాను అని అలీ ఫజల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
రక్త్ బ్రహ్మాండ్ సిరీస్‌ను తుంబాడ్ సినిమా ఫేమ్ రాహి అనిల్ బర్వే దర్శకత్వం వహిస్తుండగా.. రాజ్ అండ్ డీకే నిర్మాణ సారథ్యంలో రూపొందుతోంది. సమంతా రూత్ ప్రభు, ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బీ వంటి ప్రముఖ తారలు ఈ సిరీస్‌లో నటిస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో ఫాంటసీ అంశాలను మేళవించిన ఈ సిరీస్ ప్రేక్షకులకు ఒక విజువల్ విందును అందించనుంది. మరోవైపు, ప్రోసిత్ రాయ్ రూపొందిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ఒక మర్డర్ మిస్టరీగా, గ్రిప్పింగ్ కథనంతో రూపొందుతోంది. ఈ రెండు ప్రాజెక్టులను ఏకకాలంలో నిర్వహిస్తూ, అలీ ఫజల్ తన నటనా పరిధిని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు.