Alappuzha Gymkhana | మలయాళంతో పాటు తెలుగు, తమిళంలో సూపర్ హిట్ అందుకున్న స్పోర్ట్స్ కామెడీ డ్రామా అలప్పుజ జింఖానా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక సోనిలివ్‌లో జూన్13 నుంచి ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఖలీద్ రెహ్మాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రేమలు నటుడు నస్లెన్ కథానాయకుడిగా నటించాడు. లుక్మాన్ అవరాన్, గణపతి ఎస్. పొడువాల్, సందీప్ ప్రదీప్, అనఘా రవి, ఫ్రాంకో ఫ్రాన్సిస్, బేబీ జీన్, శివ హరిహరన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. జాబిన్ జార్జ్, సమీర్ కారత్, సుభీష్ కన్నంచెరిలతో కలిసి ఈ స్పోర్ట్స్ డ్రామాకు నిర్మించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కేరళ రాష్ట్రంలోని అలప్పుజ(అలెప్పీ) ప్రాంతానికి చెందిన జోజో జాన్సన్ (నస్లెన్), డీజే జాన్ (బేబీ జీన్), షిఫాస్ అహ్మద్ (సందీప్ ప్రదీప్), షిఫాస్ అలీ (ఫ్రాంకో ఫ్రాన్సిస్), షణవాస్ (శివ హరిచరణ్), దీపక్ పణిక్కర్ (గణపతి) ప్రాణ స్నేహితులు. వీరంతా అల్లరిచిల్లరిగా ఉంటూ, రేపటి గురించి బెంగ లేకుండా ప్రతి క్షణం ఎంజాయ్ చేద్దాం అనే మూడ్‌లో ఉంటారు. అయితే, అప్పటికే రాసిన ఇంటర్ ఫైనల్ పరీక్షల్లో ఐదుగురిలో ఒక్క షణవాస్ మాత్రమే పాస్ అయి నలుగురు ఫెయిల్ అవుతారు. దీంతో డిగ్రీలో అడుగు పెట్టే అవకాశం కోల్పోతారు. ఈ నేపథ్యంలో, స్పోర్ట్స్ కోటా ద్వారా అడ్మిషన్ సాధించేందుకు వాళ్ళు బాక్సింగ్ ఆటలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకుంటారు. అలా లోకల్‌గా ఉన్న ‘అలప్పుజా జింఖానా’ అకాడమీలో బాక్సింగ్‌లో శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తారు. అక్కడ ఈ ఆకతాయి గ్యాంగ్‌కు ఆంటోని జోషువా (లక్మన్ అవరన్) కోచ్‌గా వ్యవహరిస్తాడు. అతని శిక్షణలో స్థానిక బాక్సింగ్ పోటీల్లో ఎలాగో గెలిచిన జోజో జాన్సన్ గ్యాంగ్.. ఆ తర్వాత కేరళ స్టేట్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతుంది. అయితే, ఎంతో ప్రొఫెషనల్ ఆటగాళ్లు పోటీపడే ఆ బాక్సింగ్ పోటీల్లో ఈ ఆకతాయి గ్యాంగ్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఈ ప్రయాణంలో వాళ్ళు ఏం నేర్చుకున్నారు? స్టేట్ బాక్సింగ్ పోటీల్లో గెలిచారా? లేదా? అన్నది మిగిలిన కథ.
ఈ చిత్రం గురించి నస్లెన్ మాట్లాడుతూ, అలప్పుజ జింఖానా’చిత్రంలో జోజో పాత్రలో నటించటం ఒక గొప్ప అనుభూతినిచ్చింది. ఈ పాత్రలో నటించడం ద్వారా నాలోని బలహీనతలు, బలాలను తెలుసుకోగలిగాను. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావటం చాలా సంతోషంగా ఉంది. జూన్ 13న సోనీలివ్ ద్వారా యావత్ దేశం ఈ చిత్రాన్ని వీక్షించనుంది” అని అన్నారు.