బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్ నటించిన ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్‌కథ’(2017) సినిమా టైటిల్‌పై సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జయాబచ్చన్ ఇటీవల అసహనం వ్యక్తం చేశారు. ‘ఆ టైటిల్ నాకేమాత్రం నచ్చలేదు.. ఆ పేరు చూడండి ఎలా పెట్టారో..’ అంటూ కించపరిచేలా మాట్లాడారామె. అంతటితో ఆగకుండా.. ‘ఇది సినిమా టైటిలా? దాన్ని టైటిల్ అంటారా? అలాంటి టైటిల్స్ ఉన్న సినిమాలను నేను చూడను’ అంటూ నిర్మొహమాటంగా సెలవిచ్చారు జయా బచ్చన్.
ఈ వ్యవహారంపై చిత్ర కథానాయకుడు అక్షయ్ మౌనం వహించగా, నిర్మాత ప్రేరణా అరోరా మాత్రం జయా మాటలకు కౌంటర్ ఇచ్చారు. ‘ఎందుకా పేరు పెట్టాం? సినిమా ద్వారా మేమిచ్చిన సందేశం ఏంటి? అనేది సినిమా చూస్తే కదా తెలిసేది. ఆ సినిమాకు వచ్చిన వసూళ్ల గురించి ముందు తెలుసుకోండి. తర్వాత సినిమా చూసి అప్పుడు మాట్లాడండి మేడమ్..’ అంటూ ఎటాక్ చేశారు ప్రేరణా అరోరా. అయితే.. రీసెంట్గా ‘కేసరి చాప్టర్ 2’ ప్రమోషన్లో పాల్గొన్న అక్షయ్.. జయా మాటలపై స్పందించారు. ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్‌కథ’పై ఆమె ఏం మాట్లాడారో నాకు తెలీదు.. కానీ ఆమె ఏం మాట్లాడినా కరెక్టే..’ అంటూ నవ్వుతూ అక్షయ్ స్పందించారు. అక్షయ్ స్పందనలో వెటకారం ధ్వనిస్తున్నదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.