Mission Raniganj Movie | ఒకప్పుడు వంద కోట్లను అవలీలగా కొట్టేసిన అక్షయ్ కుమార్.. ఇప్పుడు అందులో సగం కూడా కొట్టలేకపోతున్నాడు. మరీ ముఖ్యంగా గతేడాది నుంచి అక్షయ్ కుమార్ కెరీర్ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. గతేడాది అరడజను సినిమాలు రిలీజైతే అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్టు కొట్టలేకపోయింది. అన్నీ అల్ట్రా డిజాస్టర్లే. కట్పట్లీ ఓటీటీకి ఇచ్చి సేవ్ అయ్యారు కానీ.. అది కూడా ఘోరంగా పరాజయం పాలైంది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో రిలీజైన సెల్ఫీ సినిమా సైతం పోస్టర్ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. దాంతో తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన ఓ మై గాడ్ సినిమా సీక్వెల్‌తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి ఎనిమిది ఫ్లాపుల తర్వాత హిట్టు కొట్టాడు.
పోటీగా గదర్-2 వంటి అరివీర భయంకర హిట్టు సినిమా ఉన్నా.. ఆ సినిమా పోటీని తట్టుకుని నిలబడింది. ఇక నిన్న రిలీజైన మిషన్ రాణిగంజ్ సినిమా మళ్లీ ఫ్లాపుల పర్వం మొదలు పెట్టింది. అక్షయ్ కుమార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు రెండున్నర కోట్లుకు కాస్త అటు ఇటు దాటిందని తెలుస్తుంది. అంటే కేవలం కోటిన్నర షేర్ మాత్రమే ఈ సినిమా సాధించింది. అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరో సినిమాకు కేవలం కోటిన్నర కలెక్షన్లు రావడం గమనార్హం. పైగా పోటీగా పెద్ద సినిమాలు కూడా ఏవి లేవు. అయినా కానీ ఇంత చెత్తగా పర్ఫార్మ్ చేసిందంటే జనాలు ఈ సినిమాను ఏ రేంజ్లో తిప్పికొట్టారో అర్థమవుతుంది.
ఫైనల్ రన్లో పోస్టర్ ఖర్చులు కూడా వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. స్పెషల్ 26, రుస్తుం వంటి సినిమాలు తెరకెక్కించిన టీను సురేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. పరిణితి చోప్రా హీరోయిన్గా నటించిన ఈ సినిమాను పూజా ఎంటర్టైనమెంట్స్తో కలిసి అక్షయ్ కుమార్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. 1989 నవంబర్ 13న పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్ అనే మైనింగ్ ఏరియాలో ఉన్న బొగ్గు గనుల్లో 64 మంది కార్మికులు చిక్కుకుంటారు. బొగ్గు గనుల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడే.. మైనింగ్ ఇంజనీర్ పాత్రలో అక్షయ్ కుమార్ కనిపించాడు. వారిని కాపాడడానికి అక్షయ్ ఎలాంటి సాహసాలు చేశాడు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది.