1941లో వచ్చిన ‘ధర్మపత్ని’ చిత్రంతో తెరంగేట్రం చేసిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, 1944 డిసెంబర్ 1న విడుదలైన ‘శ్రీసీతారామజననం’ సినిమాతో హీరోగా మారారు. అంటే ఆ సినిమా వచ్చి నిన్నటితో 80ఏండ్లు పూర్తయ్యాయి. ఘంటసాల బలరామయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో అక్కినేని కల్యాణరాముడిగా అలరించారు. ఆ సినిమా విడుదలైన నాటికి అక్కినేని వయసు అక్షరాలా 20 ఏండ్లు. అప్పటికి అత్యంత పిన్నవయస్కుడైన కథానాయకుడు అక్కినేనే కావడం విశేషం. అంతేకాక, ఆయన హీరోగా నటించిన తొలి పాత్ర శ్రీరాముడి పాత్ర కావడం మరో విశేషం.
ఈ సినిమాలో పద్యాలను అక్కినేని స్వయంగా ఆలపించారు. హీరోగా ‘శ్రీసీతారామజననం’తో మొదలైన అక్కినేని నట ప్రస్థానం దశాబ్దాల పాటు అద్వితీయంగా సాగింది. అనితరసాథ్యమైన పాత్రలను పోషించి, దేశం గర్వించదగ్గ మహానటుడిగా ఆయన ఎదిగారు. కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్నారు. ఒక్క ‘భారతరత్న’ మినహా.. అన్ని ప్రభుత్వ పురస్కారాలనూ అందుకున్న మేటి నటుడు నటసామ్రాట్ డా.అక్కినేని నాగేశ్వరరావు. భారత సినీ చరిత్రలో ఆయనదో సువర్ణాధ్యాయం.