అగ్ర హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రానికి ‘నా సామిరంగ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. మంగళవారం నాగార్జున జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఏఎన్నార్ నటించిన ‘సిపాయి చిన్నయ్య’ సినిమాలోని ‘నా సామిరంగ’ అనే పాటను టైటిల్‌గా తీసుకోవడం విశేషం. ఫస్ట్‌లుక్ పోస్టర్లో నాగార్జున మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. ఇక ఫస్ట్గ్లింప్స్లో ఆయన ప్రత్యర్థుల ఆటకట్టిస్తూ యాక్షన్ మోడ్‌లో కనిపించారు. నాగార్జున మాస్ లుక్స్, విజువల్స్ ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం. కీరవాణి, కథ, సంభాషణలు: ప్రసన్నకుమార్ బెజవాడ, దర్శకత్వం: విజయ్ బిన్ని.
ధనుష్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. సమాజంలోని ఆర్థిక అంతరాలను చర్చించే కథాంశమిదని సమాచారం. ఈ సినిమాలో నాగార్జున కీలకమైన పాత్రలో నటించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు.