39YearsForKingNagInTFI | టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున తెలుగు చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టి నేటికి 39 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో #39YearsForKingNagInTFI అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. అభిమానులు, సినీ ప్రముఖులు నాగార్జునకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టుల వర్షం కురిపించారు.
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని నాగార్జున స్వయంగా భావోద్వేగానికి లోనయ్యారు. “ఈ రోజు ఉదయం నా ఫోన్లో వచ్చిన ఒక సందేశం, విక్రమ్ అనే చిత్రంకి #39YearsForKingNagInTFI అనే హ్యాష్‌ట్యాగ్‌తో కూడిన పోస్ట్ చూశాను. అప్పుడే అనిపించింది.. 39 సంవత్సరాలు కనురెప్పపాటులో గడిచిపోయాయి. మీ అందరి ప్రేమ, మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. జ్ఞాపకాలకు, మాయకు ధన్యవాదాలు. మాటలకు అందని ఆశీర్వాదంగా భావిస్తున్నాను” అని ఆయన పంచుకున్నారు.
కింగ్ సినీ ప్రస్థానం
అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా, నాగార్జున 1986లో ‘విక్రమ్’ చిత్రంతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ‘కింగ్’ అనే బిరుదును సార్థకం చేసుకున్నారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, ప్రయోగాత్మక చిత్రాలకు ప్రాధాన్యతనిస్తూ, నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.
‘శివ’, ‘గీతాంజలి’ వంటి కల్ట్ క్లాసిక్స్ నుంచి ‘అన్నమయ్య’, ‘మన్మథుడు’, ‘సోగ్గాడే చిన్నినాయన’ వంటి విజయవంతమైన చిత్రాల వరకు, నాగార్జున సినీ ప్రయాణం అనేక మైలురాళ్లతో నిండి ఉంది. నటుడిగానే కాకుండా, నిర్మాతగా (అన్నపూర్ణ స్టూడియోస్), వ్యాపారవేత్తగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు.
మూడున్నర దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రయాణంలో నాగార్జున లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. వారి నిరంతర ప్రేమ, ఆదరణ వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని ఆయన తరచుగా చెబుతుంటారు. ఈ 39 సంవత్సరాల ప్రస్థానం కేవలం నాగార్జున విజయం మాత్రమే కాదు, తెలుగు సినిమా పరిశ్రమలో ఆయన స్థిరత్వాన్ని, నిలకడను కూడా చాటుతుంది.